అమృత్ టెండర్లు అనేవి ఎప్పుడో ఆరు నెలల కిందటి మాట. దీనిపై ఆయన తెలంగాణలో రెండు నెలల కిందటే ఆరోపణలు చేశారు. బీజేపీ నేతలకు సవాళ్లు చేశారు. ఆ ఎపిసోడ్ అలా ముగిసిపోయింది. కానీ హఠాత్తుగా ఆయనకు కేంద్ర మంత్రి అపాయింట్ మెంట్ లభిచింది. ఢిల్లీ వెళ్లారు. ఫిర్యాదు చేశారు. తర్వాత మీడియా సమావేశం పెట్టి కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అసలు లాజిక్ కాంగ్రెస్ నేతలకు అర్థం అయింది.
ఎన్నికలు జరుగుతున్న రెండు రాష్ట్రాల్లో తెలంగాణ విషయంలో కాంగ్రెస్ కు ఏమైనా పాజిటివ్ అభిప్రాయం ఉంటే.. దాన్ని ఆరోపణలు చేసి తుడిచేయడంతో పాటు అక్కడ పోటీ పడుతున్న బీజేపీ నేతలకు కొత్త అస్త్రాలు ఇచ్చేందుకు కేటీఆర్ ఈ పర్యటనను ఉపయోగించుకున్నారని అంటున్నారు. అంటే.. ఈ పర్యటనను కేటీఆర్ ప్లాన్ చేసుకోలేదు.. బీజేపీనే ప్లాన్ చేసిందని కాంగ్రెస్ వర్గాలు ఓ నిర్ణయానికి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి వచ్చే రెండు రోజులు మహారాష్ట్రలో విస్తృతంగా పర్యటించబోతున్నారు. ఆయన పర్యటనకు ఒక్క రోజు ముందే కేటీఆర్ ఢిల్లీలో ఆరోపణలు చేశారు.
కేటీఆర్ విషయంలో తెలంగాణలో రఘునందన్ రావు, బండి సంజయ్ వంటి వారు మాత్రమే చాలా వ్యతిరేకంగా ఉన్నారు. బాంబుల పేరుతో భయపెట్టి ఎందుకు అరెస్టులు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. కానీ మిగతా వారు మాత్రం.. సైలెంటుగా ఉంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అవినీతిపై బీజేపీకి ఫిర్యాదు చేయడం కాస్త వింతగానే ఉంటుంది. అయినా కేటీఆర్ ఏ మాత్రం ఆలోచించకుండా చేసేశారు.