అసెంబ్లీకి వెళదాం.. మైక్ ఇవ్వకపోతే ప్రజలే చూస్తారు. వారే నిర్ణయం తీసుకుంటారు.. అని ఎమ్మెల్యేలు అంటే.. మీకు చెప్పేది అర్థం కాదా.. వారు మైక్ ఇవ్వరు.. మనం వెళ్లాల్సిన పని లేదు అని జగన్ దబాయించారని వైసీపీ వర్గాలు మీడియాకు లీకులు ఇచ్చాయి. ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లాలనే ఉంది. అందుకే వారు హైకమాండ్ కు తమ ఉద్దేశాన్ని రకరకాలుగా తెలియచేశారు. అయితే జగన్ రెడ్డిది మాత్రం ఒకటే పట్టుదల. అసెంబ్లీకి పోవద్దని. ఎందుకంటే తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని.
చెరువుపై అలిగి మన అవసరాలు తీర్చుకోవడం మానేస్తే ఏమవుతుంది ?. అనే సామెత ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్యేలందరికీ తెలుస్తోంది. ఎందుకంటే అ కంపు అంతా వారే భరిస్తున్నారు. అసెంబ్లీకి ఎందుకు వెళ్లరు అని., సొంత నియోజకవర్గంలో ప్రజలు అడిగితే వారి వద్ద సమాధానం లేదు. అసెంబ్లీకి వెళ్తేనే కదా మాట్లాడేందుకు మైక్ ఇస్తారో లేదే తెలిసేది. వైసీపీ హయాంలో ఎంత మాత్రం మైక్ ఇచ్చారో ప్రజలు చూశారు. అలా చేస్తారని తెలిసి కూడా టీడీపీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లారు. వారు ఆడాల్సిన అవమానాలు పడ్డారు. ప్రజలు తీర్పు ఇచ్చారు.
ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్దమని రెడీగా ఉన్నారు. కానీ జగన్ మాత్రమే ధైర్యం చేయలేకపోతున్నారు.. ప్రతిపక్ష నేత హోదా లేకపోతే మైక్ ఇవ్వరని ఆయన ఎందుకని అనుకుంటున్నారో కానీ.., శాసనసభ సమావేశాలు జరగడానికి రూల్ బుక్ ఉంటుంది. దాని ప్రకారం సభలో మాట్లాడేందుకు అవకాశాలు వస్తాయి. నేను మాత్రమే మాట్లాడతా.. ఇంకెవరూ మాట్లాకూడదంటే ఎలా సాధ్యమవుతుంది?. జగన్ తీరుపై ఎమ్మెల్యేలకు కూడా చిరాకు పుడితే వారంతటకు వారు సభకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రశ్నలు ఇచ్చినవారు అసెంబ్లీకి హాజరవ్వాలని అనుకున్నారు. కానీ దానికి కూడా హాజరయ్యేందుకు జగన్ అంగీకరించలేదు.
అసలు ఈ నిర్ణయాలను జగన్ ఎలా తీసుకుంటున్నారోనని వైసీపీ కార్యకర్తలు కూడా మథనపడుతున్నారు. ఒక వేళ సజ్జల రామకృష్ణారెడ్డి సలహాలు ఇచ్చి ఉంటే.. జగన్ కు అయినా తెలియాలి కదా.. ఒక వేళ జగన్ నిర్ణయమే అయితే..కనీసం సజ్జల జరగబోయే పరిణామాల్ని చెప్పాల్సింది కదా అన్న సందేహాలు వస్తున్నాయి. కానీ ఎవరికి వారు.. ఎవరి ఖర్మకు ఎవరు బాధ్యులు అనుకుని సైలెంటుగా ఉండిపోతున్నారు.