రఘురామకృష్ణరాజు చివరికి డిప్యూటీ స్పీకర్ పదవితో సరి పెట్టుకుంటున్నారు. మొదట ఆయన ఎంపీ సీటు అనుకున్నారు. అది రాలేదు. తర్వాత అతి కష్టం మీద ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. గెలిచిన తర్వాత మంత్రి పదవి అనుకున్నారు. రాలేదు. తర్వాత స్పీకర్ పదవి అనుకున్నారు..అదీ రాలేదు. చివరికి డిప్యూటీ స్పీకర్ పదవితో సరి పెట్టుకున్నారు. ఏదో ఓ పదవి ప్రోటోకాల్ ఉంటుందని ఆయన సర్దుకోవాల్సిందే. మామూలుగా ఈ పదవి జనసేనకు ఇవ్వాల్సి ఉంది. కానీ సామాజిక సమీకరణాల నేపధ్యంలో రఘురామకు ఇవ్వాలని నిర్ణయించారు.దానికి పవన్ కూడా అంగీకారం తెలిపారు.
డిప్యూటీ స్పీకర్ పదవి పెద్దదేం కాదు కానీ.. ఆయనకూ ప్రోటోకాల్ ఉంటుంది. రఘురామకృష్ణరాజును డిప్యూటీ స్పీకర్గా నియమించడం వైసీపీ అధినేత జగన్ కు మరింత ఇబ్బందికరమే. ఎప్పుడైనా ఆయన అనర్హతా వేటు నుంచి తప్పించుకోవడానికి అసెంబ్లీకి రావాలనుకుంటే అయితే అయ్యన్న పాత్రుడు లేకపోతే రఘురామ చైర్లో ఉంటారు. వీరిద్దరిపై జగన్ రెడ్డి అకారణంగా వ్యవస్థల్ని ఉపయోగించి పగ తీర్చుకున్నారు. ప్రతీకారం కోసం వీరిద్దరూ ఎదురు చూస్తున్నవారే. అలాంటివారికి ఎదురుపడే ధైర్యం జగన్ రెడ్డి చేయలేరు. అధికారం ఉందని రెచ్చిపోయిన ఫలితంగా ఇప్పుడు ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
రఘురామ తనపై దాడి చేసిన వారిని.. పోలీసు అధికారుల్ని ఎప్పుడు అరెస్టు చేస్తారని ప్రశ్నిస్తూనే ఉన్నారు. అసెంబ్లీలో కూడా అదే పర్సన్ వేశారు. ఆయన చాలా పట్టుదలగా ఉన్నారు. తనను కొట్టిన వాళ్లను చట్టం ముందు నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఎంత సమయం అయినా ఆయన వెనక్కి తగ్గే అవకాశాలు లేవు.