కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పొలిటికల్ ఫార్మాట్ మార్చుకోవాలి. ఇప్పుడంతా టీ 20 రాజకీయాలు. కానీ కాంగ్రెస్ ఇంకా టెస్టు మ్యాచ్ ఫార్మాట్ లోనే ఆడుతోంది. రాజకీయాలు చేసే పద్దతి మార్చుకోవాల్సి ఉంది అని రేవంత్ రెడ్డి ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంస్థ నిర్వహించిన అడ్డా అనే కార్యక్రమంలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. గతంలోలా రాజకీయాలు లేవని ఇప్పుడు స్విగ్గీ తరహాలో రెండు నిమిషాలలో డెలివరీ అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయని ఈ విధానానికి కాంగ్రెస్ మారాల్సి ఉందని రేవంత్ అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీవి ఓల్డ్ మోడల్ పాలిటిక్స్
సొంత పార్టీ రాజకీయ పయనంపై రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు..అదీ జాతీయస్థాయి మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో బహిరంగంగా చేయడం ఆసక్తికరమే. కాంగ్రెస్ పార్టీ ఓల్డ్ స్కూల్ రాజకీయాలు చేస్తోందని అందరికీ తెలుసు. ఆ పార్టీలో దూకుడు ఉండదు. ముఖ్యంగా యువ నేతల్ని.. ఏ మాత్రం పలుకుబడి లేని హైకమాండ్ పేరుతో ఉండే కొంత మంది నేతలు నియంత్రిస్తూ ఉంటారు. రేవంత్ పై ఆ ప్రభావం ఎక్కువగా ఉంది.ఆయనను గట్టిగా నిర్ణయాలు తీసుకోనివ్వడం లేదు. అది పాలనలోనా రాజకీయంగానా అన్న సంగతి పక్కన పెడితే.. రేవంత్ కాళ్లు, చేతులు కట్టేస్తున్నారన్నది మాత్రం నిజమని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు చెబుతూ ఉంటాయి.
బీజేపీతో పోటీ పడాలంటే మారాల్సిందే !
బీజేపీతో పోటీ పడాలంటే.. ఆ పార్టీతో పాటు పరుగులు పెట్టాలంటే ఫార్మాట్ మార్చుకుని తీరాల్సిందేనని రేవంత్ అంటున్నారు. నిజానికి ఇది పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్పేంత అవకాశం ఆయనకు రాలేదు. తెలంగాణలో పార్టీని గెలిపించినా.. ముఖ్యమంత్రిగా ఉన్నా.. జైరామ్ రమేష్ , దీపాదాస్ మున్షి వంటి వాళ్లు రేవంత్ ను తమ ఆదేశాల ప్రకారం పని చేసే వారిగా చూస్తారు. దాంతోనే అసలు సమస్య వస్తుంది. ఇప్పటికే హైకమాండ్ కు రేవంత్ రెడ్డి చాలా చెప్పి ఉంటారని వారి వైపు నుంచి స్పందన లేకపోవడం వల్లనే ఇలాంటి వ్యాఖ్యలు బహిరంగంగా చేసి ఉంటారని అంటున్నారు.
రేవంత్‌కు పదే పదే అడ్డం పడుతున్న కొంత మంది ఢిల్లీ నేతలు !
రేవంత్ రెడ్డి తెలివైన రాజకీయ నేత. ఆయన ఈ వ్యాఖ్యలను తనకు ఉన్న అసంతృప్తి అన్న కోణంలో చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడుగా ఉండాలన్నది తన అభిప్రాయం అన్నట్లుగా చెప్పారు. ఇంటర్యూ మొత్తం మీద ఆయన గాంధీ కుటుంబాన్ని పొగిడినంతగా ఎవరూ పొగిడి ఉండరు. వారు చేసిన త్యాగాల గురించి ఒక్కటే చెప్పారు.. రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఆ కుటుంబం ఏ పదవి తీసుకుందో చెప్పాలన్నారు. వారికి సొంత ఇళ్లు కూడా లేవని గుర్తు చేశారు. రేవంత్ ఇలా తన విధేయతతో పాటు బీజేపీ విధానాలను విమర్శించడం కూడా చేశారు. ఆయన జాతీయస్థాయిలో కీలక వక్తగా మారుతున్నారు. రేవంత్ ను జనాదరణ లేని నేతల నీడలో ఉంచకుండా.. స్వతంత్రంగా పని చేసుకోనిస్తే కాంగ్రెస్ పార్టీకి ఆయన పెద్ద ఎస్సెట్ అవుతారు. కానీ కాంగ్రెస్ స్వీయ వినాశనమే లక్ష్యంగా పని చేస్తూంటుందన్న విమర్శలు ఊరకనే రావు కదా!