తెలంగాణ రాజకీయాలు ఢిల్లీ మీదుగా మళ్లీ హైదరాబాద్ చేరుకున్నాయి. రేవంత్, పొంగులేటిని జైలుకు పంపిస్తా అని కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి ఓ టెండర్ల అంశంపై కేంద్ర మంత్రి ఫిర్యాదు చేశారు. టెండర్లలో అవినీతి గురించి చెప్పాలంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అనేకానేక టెండర్ల గురించి.. కథలు కథలుగా కాంగ్రెస్ నేతలు చెబుతారు. ఇంత మాత్రానికే రేవంత్, పొంగులేటిని జైలుకు పంపుతారా అన్నది సందేహం. అసలు విషయం మాత్రం కేటీఆర్ జైలుకు వెళ్లకుండా బీజేపీ నేతలతో మాట్లాడుకుని వచ్చారని కాంగ్రెస్ నేతలంటున్నారు.
తెలంగాణలో ప్రభుత్వం కాంగ్రెస్‌దే అయినా ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్ని అరెస్టు చేయాలంటే బీజేపీ అనుమతి తప్పని సరి. గత ప్రభుత్వంలో అవినీతి అంటూ కేసులు పెట్లాలంటే గవర్నర్ అనుమతి ఉండాలి. కేటీఆర్ ప్రభుత్వానికి సంబంధం లేని తప్పులు చేసి ఉంటే అవినీతి చేసి ఉంటే.. కేసులు పెట్టి అరెస్టు చేయడానికి గవర్నర్ పర్మిషన్ అక్కర్లేదు.కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపైనా చర్యలు తీసుకునేందుకు గవర్నర్ అనుమతి కోసం కాంగ్రెస్ ఎదురు చూస్తోంది.
ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో రూ. 55 కోట్లు లెక్కాపత్రం లేకుండా పంపేశారు. అంటే.. ఆ నగదు దొంగతనానికి గురయిందని అనుకోవచ్చు. ఏసీబీ అధికారుల దర్యాప్తులో ఇది కేటీఆర్ నోటి మాట ద్వారా ఇచ్చారని తేల్చారు. అందుకే ఆయనను ప్రశ్నించేందుకు అవకాశం కావాలని దరఖాస్తు చేశారు. గవర్నర్ అనుమతి ఇస్తే అరెస్టు కూడా చేసుకోవచ్చు. ఇంకా అక్కడ్నుంచి అనుమతి రాలేదు. రాకపోతే బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్‌ల అగ్రెసివ్ గా ఎదురుదాడి చేస్తుంది. వస్తే కేటీఆర్ ను వెంటనే జైల్లో వేస్తారు. అంతటితో అది ఆగదు. ప్రస్తుతం బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయాలతో వారిని అలా వదిలేయకూడదని రేవంత్ అనుకుంటారు. అందుకే వచ్చే వారంలో తెలంగాణ రాజకీయాలు కీలక మలుపులు తిరిగే అవకాశం ఉంది.