అసలు అసెంబ్లీకి జగన్ వెళ్లనివ్వకపోవడంతో ఇక మాక్ అసెంబ్లీకి మాత్రం ఎందుకని వైసీపీ ఎమ్మెల్యేలు అనుకున్నారు. అసెంబ్లీ జరిగేచప్పుడు మాక్ అసెంబ్లీ నిర్వహించాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు సాక్షిలో లైవ్ టెలికాస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఎలా చేస్తారో అలాగే చేస్తారని అందరూ అనుకున్నారు. తీరా అసెంబ్లీ జరుగుతోంది కానీ మాక్ అసెంబ్లీ ప్రారంభం కాలేదు. ఏమిటా అని మీడియా ప్రతినిధులు ఆరా తీస్తే అసలు ఎమ్మెల్యేలు ఎవరూ జగన్ ఇంటికి రాలేదట.
అసలు అసెంబ్లీకి వెళ్లకుండా ఇలా అసెంబ్లీ సెట్టింగ్ వేసుకుని మాక్ అసెంబ్లీ నిర్వహిస్తే మరీ కామెడీ అయిపోతామని ఎమ్మెల్యేలు కంగారు పడ్డారు. జగన్ ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీకి డుమ్మా కొడితే ఇతర ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్లరన్న ప్రశ్న .. ప్రజల నుంచి వస్తోంది. వైసీపీ క్యాడర్ కూడా దీనికి సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదు. అందుకే.. ఈ అంశంలో మరింత కామెడీ కావడం కంటే.. మాక్ అసెంబ్లీని కూడా రద్దు చేసుకుంటే బెదరని నిర్ణయించారు. జగన్ కు ఇలాంటివి అసలు ఇష్టం ఉండదు. కాకపోతే ఎదో ఒకటి చెప్పాలి కాబట్టి మాక్ అసెంబ్లీ అన్నారు.
అసెంబ్లీ జరుగుతూ ఉంటే ఏదో ఒకటి చెప్పకపోతే బాగోదు కాబట్టి జగన్ రెడ్డి బడ్జెట్ పై మీడియా ముందు విశ్లేషించాలని నిర్ణయించుకున్నారు. దాన్ని ఆయన రికార్డు చేసి.. ఎడిటింగ్ చేసి.. రెండు గంటల తర్వాత అనుకూలమైన సమయంలో వదలుతారు. కానీ జగన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పే దానికి.. బయట మీడియా ముందు చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. మీడియా ముందుచెబితే అది రొటీన్ మాటలు అవుతాయి. అసెంబ్లీలో చెబితేనే దానికో విలువ ఉంటుంది.