’పుష్ప 2’లో కనిపించే ఐటెమ్ గాళ్ ఎవరన్న విషయంలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఓ దశలో శ్రద్దాకపూర్ పేరు దాదాపుగా ఖాయమైంది. చివర్లో శ్రీలీల వచ్చి చేరింది. నిజానికి పుష్ప 2 కోసం శ్రీలీలనే మొదటి ఆప్షన్. కానీ వరుస పరాజయాల నేపథ్యంలో శ్రీలీల పేరు పక్కన పెట్టారు. చివరికి మళ్లీ శ్రీలీలనే ఎంపికైంది. శ్రీలీల మంచి డాన్సర్. బన్నీకి పోటీగా డాన్స్ చేసి మెప్పించగల సత్తా శ్రీలీలకే ఉందని టీమ్ మొత్తం భావించింది. దాంతో ఈ ఆఫర్ శ్రీలీల చేతికి అందింది.
ఓ దశలో శ్రద్దాకపూర్ వైపు చూసింది టీమ్ మొత్తం. ఆమెతో సంప్రదింపులు కూడా జరిగాయి. దాదాపుగా రూ.8 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్టు సమాచారం. ఓ పాటకు 8 కోట్లంటే చాలా పెద్ద మొత్తం. అయితే నార్త్ లో శ్రద్దాకపూర్ వల్ల ఇంకాస్త హైప్ వస్తుందని భావించిన మైత్రీ మూవీస్ అనుకొన్నంత పారితోషికం ఇవ్వడానికి రెడీ అయ్యింది. కానీ చివరి నిమిషంలో సుకుమార్ అడ్డు చెప్పారని టాక్. ఇప్పటికే పుష్పకి క్రేజ్ ఎక్కువైందని, కొత్తగా శ్రద్దాకపూర్ వల్ల వచ్చేదేం ఉండదని, శ్రద్దా కంటే, శ్రీలీల డాన్సులే బాలీవుడ్ కు కొత్తగా అనిపిస్తాయని సుకుమార్ అడ్డు పడ్డాడట. సుకుమార్ చెబితే, కాదనేది ఏముంది? అందుకే శ్రద్దాని పక్కన పెట్టి, శ్రీలీలతో ఫిక్సయ్యారు. ఈ పాట కోసం శ్రీలీలకు ఇచ్చింది కోటి రూపాయలే. అంటే సుకుమార్ నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చాడన్నమాట.
డిసెంబరు 5న ‘పుష్ప 2’ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. 4 అర్థరాత్రి నుంచి బెనిఫిట్ షోల హంగామా మొదలైపోతుంది. ఈనెల 17న ట్రైలర్ విడుదల చేస్తున్నారు.