పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును పోలీసులు చేర్చారు. అందులో కేటీఆరే మొత్తం కుట్రకు సూత్రధారి అన్న అర్థం వచ్చేలా ఆయన పేరును పెట్టిన వైనం చూసి రాత్రికి రాత్రి అరెస్టు చేస్తారన్న అనుమానం బీఆర్ఎస్ పెద్దలకు వచ్చింది. అందుకే బీఆర్ెస్ కార్యకర్తలు కేటీఆర్ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున వచ్చారు. నంది నగర్‌లోని ఆయన ఇంటి వద్దకు అర్థరాత్రి పూట దాదాపుగా రెండు వందల మంది వచ్చారు. కొంత మంది వెళ్లడం.. కొంత మంది రావడం.. ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల రెండు వందల మంది ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కేటీఆర్‌ను అరెస్టు చేయడానికి ఇప్పుడు గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు. పబ్లిక్ సర్వెంట్ గా పని చేస్తూ ఆయన అవినీతి చేసి ఉంటే దానికి తగ్గ ఆధారాలను గవర్నర్ కు చూపించి అనుమతి పొందాలి. కానీ ఇలా బయట నేరాలు, కుట్రలు చేస్తే గవర్నర్ అనుమతి అవసరం లేదు. ఇలాంటి అవకాశాన్ని రేవంత్ రెడ్డి వదులుకోరని అరెస్ట్ చేయించేస్తారని బీఆర్ఎస్ నేతలు ఊహించారు. అందుకే కార్యకర్తల్ని కేటీఆర్ ఇంటివద్ద మోహరింప చేశారు.
అయితే పోలీసులు అసలు అలాంటి ప్రయత్నాలు చేయలేదు. కేటీఆర్ ఇంటి వైపు ఎవరూ రాలేదు. అయినప్పటికీ అరెస్టు ముప్పు పొంచి ఉందని.. కలెక్టర్ పై దాడి వ్యవహారాన్ని ప్రభుత్వం, పోలీసులు , మొత్తం అధికార యంత్రాంగం చాలా సీరియస్ గా తీసుకుందని స్పష్టత రావడంతో అరెస్టు ఖాయమని నమ్ముతున్నారు. అందుకే వీలైనంత వరకూ దీన్ని రాజకీయ ఉద్రిక్తతలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నేతల్ని ఇలా అరెస్టు చేసేవారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు ఆ పరిస్థితి వస్తోంది.