మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. అక్కడ రెండు కూటముల మధ్య పోరు హోరాహోరీగా నడుస్తోంది. ఓ కూటమి కాంగ్రెస్ అయితే..మరో కూటమికి బీజేపీ నాయకత్వం వహిస్తున్నాయి. రెండు కూటముల్లో ఓ ఎన్సీపీ, ఓ శివసేన ఉన్నాయి. చీలిక పార్టీలు బీజేపీతో ఉన్నా అవే ఒరిజినల్ పార్టీగా గుర్తింపు తెచ్చుకున్నాయి. అసలు తమ పార్టీలు అయినా .. కొత్త పార్టీల పేరుతో ఉద్దవ్ థాక్రే, శ్రరద్ పవార్లు కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఫలితాల తర్వాత ఎన్సీపీ కానీ.. శివసేన కానీ ఒక్కటే ఉంటుందని అనుకోవచ్చు. మిగిలిన పార్టీలు ఇతర పార్టీల్లో విలీనం అవుతాయి. అయితే ఇప్పుడు బీజేపీ కూటమి గెలవకపోతే జాతీయ రాజకీయాల్లోనూ ప్రభావం కనిపిస్తుందని అంచనాలు వస్తున్నాయి. బీజేపీతో పాటు ఉన్న ఎన్సీపీ, శివసేనలకు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీలను ప్రజలు ఆదరించకపోతే వారు మాతృ పార్టీలకు వెళ్లిపోతారు. అప్పుడు కేంద్రం మరిన్ని చిక్కుల్లో పడుతుంది. మనుగడకు సమస్య రాకపోవచ్చు. కానీ అది ఇబ్బందికరమే.
అందుకే మహారాష్ట్ర ఎన్నికలను బీజేపీ అగ్రనాయకత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రధాని మోదీ వరుస పర్యటనలు చేస్తున్నారు. ఎన్డీఏ పార్టీలన్నింటినీ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. అయితే మహారాష్ట్రలో బీజేపీ చేసిన రాజకీయాన్ని గుర్తు చేసుకుంటే మాత్రం.. ఆ పార్టీ కూటమిని ప్రజలు ఆదరించరు. ఉద్దవ్ ధాకరే ప్రభుత్వాన్ని అన్యాయంగా పడగొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇలా చేసిన కర్ణాటకలో బీజేపీ ఘోరపరాజయం పాలైంది. ఇప్పుడు మహారాష్ట్రలోనూ అదే రిపీట్ అయితే ముందుముందు ప్రభుత్వాలను కూల్చే విషయంలో బీజేపీ ఆలోచించే అవకాశాలు ఉన్నాయి.