నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ తో డెబ్యూ చేయించే బాధ్యత ప్రశాంత్ వర్మపై పడింది. ఆయన మోక్షజ్ఞ సినిమాకు సంబంధించిన కసరత్తులు ముమ్మరం చేశారు. త్వరలోనే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం చాలామంది పేర్లు పరిశీలిస్తున్నారు. చివరికి విక్రమ్ తనయుడు ధృవ్ పేరు ఖరారయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ ఇప్పుడు ధృవ్ తో చర్చలు జరుపుతున్నారు. ధృవ్ కూడా ఈ సినిమాలో నటించడానికి అంగీకారం తెలిపినట్టు సమాచారం అందుతోంది. త్వరలోనే విలన్ గా.. ధృవ్ పేరు ఖాయమవుతుందని టాక్.
కథానాయికగా రవీనా ఠాండన్ కుమార్తె రషా థడానీ ఎంపిక కూడా ఖాయమైపోయింది. ఆమెతో ఓ ఫొటో షూట్ కూడా చేశారు. హీరో, విలన్, హీరోయిన్… ఈ ముగ్గురూ స్టార్ ఇంటి నుంచి వస్తున్న వారసులే కావడం విశేషం. ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్ర ఉందని, ఆ పాత్ర కోసం కూడా స్టార్ కిడ్ నే తీసుకోబోతున్నారని సమాచారం అందుతోంది. ఈ చిత్రంలో బాలయ్య అతిథి పాత్రలో దర్శనమిస్తారు. ఆయన పాత్ర శ్రీకృష్ణుడ్ని పోలి ఉంటుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మోక్షజ్ఞ పాత్ర కీ పురాణాల్లోని అభిమన్యుడుకీ లింక్ ఉందట. అలాగైతే… ధృవ్ పాత్రకు ఎవర్ని రిఫరెన్స్ తీసుకొన్నారో మరి!