కర్ణుడి చావుకి వందకారణాలన్నట్టు… ఓ సినిమా ఫ్లాప్ అవ్వడానికి, హిట్టవ్వడానికీ అన్నే కారణాలుంటాయి. ఫ్లాప్ సినిమాకు ఇంకొన్ని ఎక్కువ ఉండొచ్చు. హిట్ సినిమాకు ఈమధ్య సింపతీ కార్డు కూడా గట్టిగా పని చేస్తుందని టాలీవుడ్ గట్టిగా నమ్ముతోంది. మొన్నటికి మొన్న ‘క’ సినిమా మంచి విజయాన్ని అందుకొంది. కంటెంట్ బాగుంది, క్లైమాక్స్ అదిరిపోయింది.. దానితో పాటు కిరణ్ అబ్బవరంపై ఉన్న సింపతీ ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కిరణ్ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. తనని తొక్కేస్తున్నారని, సపోర్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ సామాన్యుడు ఎదగకూడదా? అని నేరుగా ఇండస్ట్రీనే ప్రశ్నించారు. సినిమా బాగోలేదని చెబితే, ఇండస్ట్రీ నుంచే వెళ్లిపోతానని ఛాలెంజ్ చేశారు. సినిమా విడుదలైంది. కంటెంట్ జనాలకు నచ్చింది. దాంతో పాటు ‘కిరణ్ కి ఓ హిట్ పడితే బాగుణ్ణు’ అనే సింపతీ కలిసొచ్చింది.
‘హనుమాన్’ సమయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమాపై కూడా సింపతీ ఫ్యాక్టర్ ఉంది. చిన్న సినిమాపై పెద్ద సినిమా (గుంటూరు కారం) పోటీకి రావడం ఓరకంగా.. హనుమాన్ కి ప్రేక్షకుల నుంచి సానుభూతి దక్కేలా చేసింది. అలాగని హనుమాన్ ని తక్కువ చేయడం లేదు. హనుమాన్ కంటెంట్, క్వాలిటీ, టెక్నీషియన్ల పనితీరు.. భేషుగ్గా ఉన్నాయి. దానికి సింపతీ ఫ్యాక్టర్ తోడయ్యిందంతే. ఇదే విషయంపై పరోక్షంగా స్పందించారు నిర్మాత నాగవంశీ. ‘డాకు మహారాజ్’ టీజర్ విడుదల ప్రెస్ మీట్లో ఈ సింపతీ ఫ్యాక్టర్ గురించిన ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన కూడా నిర్మొహమాటంగా సమాధానం ఇచ్చారు. సింపతీ కార్డులన్నీ తన సినిమాలు వచ్చినప్పుడే వాడుతున్నారని, తన సినిమా విడుదల సమయంలోనే కష్టాలు గుర్తొస్తున్నాయని, ఈసారి బాలయ్య సినిమా విడుదల సమయంలోనూ తాను కూడా ఏదో ఓ కష్టం చెప్పుకొని, సింపతీ కార్డు వాడుకొంటానని చెప్పుకొచ్చారు.
కాకపోతే..అప్పటి హనుమాన్, ఇప్పటి `క` రెండు సినిమాల్లోనూ విషయం ఉంది. కాబట్టి ప్రేక్షకులు ఆదరించారు. ప్రెస్ మీట్లలో ఎన్ని బాధలు చెప్పుకొన్నా, తమ కష్టాల్ని ఏకరువు పెట్టుకొన్నా ప్రేక్షకులు చూసేది కంటెంటే. మిగిలివన్నీ యాడ్ ఆన్స్ అంతే! నిజంగానే సింపతీతోనే సినిమాలు నడిస్తే.. ప్రెస్ మీట్లలో సెంటిమెంట్ సీన్లు దట్టించేవారంతా. సీరియల్ కష్టాలన్నీ అక్కడే ఏకరువు పెట్టేవారు. సినిమా ఏదైనా పోరాటమే. ఎన్నో కష్టనష్టాల్ని భరించి ఓ సినిమా పూర్తి చేస్తారు. ప్రేక్షకులకు అదంతా అనవసరం. తెరపై బొమ్మ బాగుందా, లేదా? అదే చూస్తారు. ఈ విషయంలో మరో మాటకు తావు లేదు.