మాజీ స్పీకర్ తమ్మినేని సీతారం సీటు కిందకు నీళ్లు వచ్చేశాయి. ఆయన ఇంచార్జి పదవిని జగన్ పీకేశారు. ఆముదాలవలస నియోజకవర్గంలో ఇక జోక్యం చేసుకోవద్దని చెప్పి వేరే వ్యక్తిని ఇంత కాలం ఆయనకు వ్యతిరేకంగా పని చేసిన నేతను ఇంచార్జ్‌గా పెట్టేశారు. దీంతో కక్కలేని మింగలేని తమ్మినేని సీతారాం సైలెంట్ అయిపోయారు. కనీసం తన కుమారుడికి ఇంచార్జ్ పదవి ఇవ్వాలని ఆయన చేసిన విజ్ఞప్తిని జగన్ పట్టించుకోలేదు.
అముదాల వలస సమన్వయకర్తగా చింతాడ రవికుమార్ అనే యువనాయకుడ్ని జగన్ నియమించారు. ఈ నియామకంపై తమ్మినేని కుటుంబ అభిమానులు, అనుచరులు తీవ్ర నిరాశకి గురయ్యారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సువ్వారి గాంధీ, చింతాడ రవికుమార్‌లు ఎవరికి వారు తమకే టిక్కెట్ వస్తుందని ప్రచారం చేసుకున్నారు. చివరికి తమ్మినేనికే ఇచ్చారు. గాంధీ ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. చింతాడ రవికుమార్ స్పీకర్ కు సహకరించలేదు. తనకు వ్యతిరేకంగా పని చేసిన వారికి ఇంచార్జ్ పదవి ఇవ్వడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు.
తన కుమారుడికి రాజకీయ భవిష్యత్ కోసం తమ్మినేని సీతారాం ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గానికి అయినా ఇంచార్జ్‌ని చేయాలని కోరినట్లుగా చెబుతున్నారు. అయితే ఆయన మాటల్ని జగన్ ఆలకించలేదు. పరిశీలకుడిగా మాత్రం సీతారాంను నియమించారు. పరిశీలన చేయడానికి ఏమీ ఉండదని తమ్మినేని సీతారం ఇక అనధికారిక రిటైర్మెంట్ తీసుకున్నట్లేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనేం చేస్తారో మరి.