వైసీపీ లీడర్లు, క్యాడర్లు ఇక పూర్తిగా నమ్మకం వదిలేసుకోవచ్చు. ఎవరు అయితే తమ పార్టీని పాతాళంలో పడిపోవడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారో ఆయన చేతికే పార్టీని అప్పగించేశారు జగన్. ఆయన దగ్గరకు రాకుండా చేయండి మహా ప్రభో అని వేడుకుంటున్నా జగన్ మాత్రం పట్టించుకోవడంలేదు. తాజాగా ఆయనకే వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా పదవి ప్రకటించేశారు.
మొత్తంగా ఆరుగురు రెడ్లు – ఒక్క బొత్స
ఇంతకు ముందు ఆరుగురు రీజినల్ కోఆర్డినేటర్లను ప్రకటించారు. ఇందులో విజయసాయిరెడ్డి,సుబ్బారెడ్డి లాంటి ఐదుగురు రెడ్లు, ఒక్క బొత్స ఉన్నారు. వీరందరికి హెడ్డుగా సజ్జల ఉంటారు. అంటే ఈ ఆరేడుగురే మొత్తం పార్టీని నడిపిస్తారు. జగన్ చేసేదేమీ ఉండదు. ఆయనకు ఏ అంశంపైనా పూర్తి అవగాహన ఉండకుండా చేయాల్సిన రాజకీయాలు సజ్జల చేస్తూంటారు. సజ్జల ఏది చెబితే అది చేయాల్సిందే. ఇప్పుడు పార్టీలోనూ అదే పరిస్థితి.
సజ్జలపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత
సజ్జల రామకృష్ణారెడ్డిపై పార్టీలో ఎవరిలోనూ సానుకూలత లేదు. ఆయనకంటూ ఓ ప్రత్యేక వర్గం పార్టీలో ఉంది. వారెవరూ పార్టీ కోసం పని చేయరు. క్షేత్ర స్థాయిలో పని చేసేవారిని సజ్జల రామకృష్ణారెడ్డి… పార్టీ ద్వారా పని చేసి డబ్బు సంపాదించుకునే వ్యక్తులుగా చూస్తారు. ఎవరికైనా పదవులు అయినా మరొకటి అయినా చివరికి జగన్ ను కలవాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి చూపించే ప్రయారిటీ వేరుగా ఉంటుంది. ఆయనపై పార్టీలో 70 శాతం వ్యతిరేకత ఉంటుంది.ఆయన నీడ జగన్ పై పడకపోతే చారని అనుకుంటూ ఉంటారు.కానీ జగన్ మాత్రం ఆయనను వదల్లేని పరిస్థితుల్లోకి పడిపోయారు.
ఇక కోటరీదే పార్టీ
ఇక వైసీపీ పార్టీ జగన్ చుట్టూ ఉన్న కోటరీలోకే వెళ్లిపోయినట్లయింది. జగన్ వద్దకు వెళ్లేందుకు ఎవరికీ యాక్సెస్ ఉండదు.సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫీసు నుంచి వచ్చే ఆదేశాలతో పార్టీ నేతలు మీడియాతో మాట్లాడతారు. జగన్ దగ్గరకు కూడావెళ్లలేరు. మొత్తంగా జగన్ తన కోటరీని నమ్ముకోవద్దని వారిని దూరం పెట్టాలని క్యాడర్ కోరుకుంటున్నారు. కానీ జగన్ మాత్రం తనకు క్యాడర్ కన్నా కోటరీనే ముఖ్యమని తేల్చారు. ఇక పార్టీ క్యాడర్, లీడర్లు తాము ఏం చేయాలో తేల్చుకునేందుకు రెడీ అయ్యే అవకాశం ఉంది.