జగన్మోహన్ రెడ్డి తన హయాంలో అప్పుల విషయంలో టీడీపీ, బీజేపీ, జనసేన తప్పుడు ప్రచారం చేశాయని తమ మీడియాలో చెప్పేసుకుంటున్నారు. ప్రచారం చేసుకుంటున్నారు. ఒకటి రెండు పద్దుల్లో అప్పులు చెప్పి అవే తాను చేసిన అప్పులంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అసెంబ్లీలో పది లక్షల కోట్ల అప్పులకు లెక్కలు చెప్పారు. కాదు ఇంకా తక్కువ ఉన్నాయంటే అసెంబ్లీకి వచ్చి చెప్పాలని సవాల్ చేశారు. ఇది జగన్ రెడ్డికి ఎంతో గొప్ప అవకాశం అనుకోవచ్చు. ఎందుకంటే అప్పులు తక్కువ అని గట్టిగా చెబుతున్నారు కాబట్టి అది అసెంబ్లీలోనే నిరూపించవచ్చు.
అప్పులు తక్కువ అని నిరూపించాలని చంద్రబాబు సవాల్ చేశారు. స్పష్టమైన లెక్క బయట పెట్టారు.దీనిపై జగన్ అసెంబ్లీకి హాజరైతే ఖచ్చితంగా మైక్ ఇస్తారు. ఆయన ఎంత సేపు అప్పుల వివరాలపై మాట్లాడాలనుకుంటే అంత సేపు మాట్లాడేందుకు అవకాశం ఇస్తారు. అందులో డౌట్ ఉండదు. ఒక వేళ మైక్ కట్ చేస్తే ప్రభుత్వం అవాస్తవాలు చెప్పిందని.. ప్రజలకు నిజాలు తెలుస్తాయని మైక్ కట్ చేశారని అనుకుంటారు. అప్పుడు జగన్ కే అడ్వాంటేజ్ వస్తుంది.
అయితే ఇక్కడ జగన్ కూ చిక్కులు ఉన్నాయి. ఆయన అప్పులపై తప్పుడు లెక్కలు చెబితే అప్పటికప్పుడు నిజాలను .. పత్రాలను ప్రజల ముందు ఉంచేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. అప్పుల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారో కూడా వెల్లడిస్తారు. అప్పు రత్న అనడానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయని నిరూపిస్తారు. నిజంగా జగన్ తాను అప్పులపై వాస్తవాలే చెబుతున్నానని అనుకుంటేనే ఈ సవాల్ స్వీకరించి అసెంబ్లీకి వెళ్లి మాట్లాడాలి. సాక్షి మార్క్ వార్తలు అయితే ఆయన వెళ్లకపోవడమే మంచిది.
కానీ మీడియా ముందు ఏం చెప్పినా అది ప్రజల్లోకి ఎక్కదు. రాజకీయపరమైన ఎదురుదాడిగానే భావిస్తారు. ఏది చెప్పాలనుకున్నా అసెంబ్లీలో చెబితేనే దానికో విలువ ఉంటుంది. జగన్కు అది అర్థమవుతుందో లేదో మరి!