అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అత్యంత విలువైన స్థలాలను తమ పేరుతో రాయించుకుని పార్టీ ఆఫీసుల్ని అనుమతులు లేకుండా కట్టేసుకున్న వైసీపికి గట్టి షాక్ ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఆ స్థలాలన్నీ రూపాయి రెండురూపాయలకు లీజుకు తీసుకున్నారు. లీజులు కూడా చెల్లించలేదు. లీజులకు తీసుకున్న స్థలాల విషయంలో చాలా రూల్స్ పాటించాల్సి ఉంటుంది. వాటిలో అక్రమ నిర్మాణాలు చేపడితే వెంటనే స్వాధీనం చేసుకోవచ్చు.
వైసీపీ తీసుకున్న స్థలాల్లో ఆఫీసులు కట్టేశారు. వాటిని కూల్చడం కంటే స్వాధీనం చేసుకుని ప్రజావసరాలకు వినియోగించుకోవడం ముంచిదని భావిస్తున్నారు. ఆ దిశగా ప్రస్తుతానికి నివేదికలు రెడీ అయ్యాయి. వైసీపీ ఎన్ని చోట్ల స్థలాలు లీజుకు తీసుకుంది. .. ఎన్ని చోట్ల నిబంధనలు ఉల్లంఘించింది.. వెనక్కి తీసుకోవాలంటే ఏం చేయాలన్నదానిపై పూర్తి నివేదిక రెడీ అయింది. ఒకటి, రెండు చోట్ల మినహా అన్ని చోట్లా లీజుల్ని క్యాన్సిల్ చేయవచ్చని అధికారులు నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ నివేదికపై త్వరలోనే నిర్ణయం తీసుకుని.. అక్రమంగా నిర్మించిన భవనాలన్నింటినీ జప్తు చేయనున్నారు. వాటిని ప్రభుత్వ అవసరాలకు వినియోగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే కోర్టు కూడా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కూల్చివేయడం మంచిది కాదు కాబట్టి.. వాటిని ప్రజాప్రయోజనాల కోసం వాడే అవకాశాలను పరిశీలిస్తోంది. నిజానికి ఆ నిర్మాణాలన్నీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి సంస్థ చేపట్టింది. వైసీపీ అధికారికంగా డబ్బులు చెల్లించిందో లేదో కూడా విచారణలో తేలుతుంది. డబ్బులు చెల్లించకుండా అయోధ్యరామిరెడ్డి అలాంటి ఇంద్ర భవనాల్ని ఎలా నిర్మించారో కూడా స్పష్టత వస్తుంది.