ఓ సినిమాకు ఆర్.ఆర్ ఇవ్వడంలో తమన్ సిద్ధహస్తుడైపోయాడు. అఖండ లాంటి సినిమా అందుకు అతి పెద్ద ఉదాహరణ. ఆర్.ఆర్ ఇవ్వాలంటే తమనే ఇవ్వాలన్నంత క్రేజ్ ఆ సినిమాతో తమన్ సొంతమైంది. అనూహ్యంగా ‘పుష్ప 2’కి నేపథ్య సంగీతాన్ని అందించే అవకాశం తమన్ ని వరించింది. అయితే సినిమా మొత్తం కాదు, ఆర్.ఆర్ని తన తోటి సంగీత దర్శకులు అజనీష్, శ్యామ్ సి.ఎస్ లతో కలిసి పంచుకొన్నాడు తమన్. ఫస్టాఫ్ అంతా తమన్ చేతుల మీదుగానే నడిచింది. ‘పుష్ప 2’కి సంబంధించి తమన్ వర్క్ పూర్తయిపోయింది. కేవలం 15 రోజుల్లో తమన్ ఫస్టాఫ్ పూర్తి చేసి ఇచ్చాడు.
నిజానికి ‘పుష్ప 2’ ఆర్.ఆర్ మొత్తం తమన్ తోనే పూర్తి చేయాలని సుకుమార్ భావించారు. కానీ చేతిలో కేవలం 15 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ పది హేను రోజుల్లో సినిమా మొత్తం పూర్తి చేయడం కుదరదని తమన్ చెప్పేశాడట. అందుకే ఫస్టాఫ్ వరకూ మాత్రమే తమన్ పూర్తి చేశారు. సెకండాఫ్ అజనీష్, శ్యామ్ ఫినిష్ చేశారు. సెకండాఫ్లో అజనీష్ కంటే శ్యామ్ కే ఎక్కువ సీన్లు కేటాయించారని తెలుస్తోంది. శ్యామ్ కూడా చాలా త్వరగా తన పని పూర్తి చేశాడని తెలుస్తోంది. ”పుష్ప 2 చూశా. ఆ విజువల్స్ అదిరిపోయాయి. బన్నీ మరోసారి తన పెర్ఫార్మెన్స్ తో చెలరేగిపోయాడు. ఎన్ని అవార్డులున్నా అవన్నీ బన్నీని వెదుక్కొంటూ రావాల్సిందే” అంటూ తమన్ జోస్యం చెప్పాడు. ఓరకంగా ‘పుష్ప2’tకి సంబంధించిన మొదటి రివ్యూ బన్నీ నుంచి వచ్చినట్టే అనుకోవాలి. రేపు ట్రైలర్ రాబోతోంది. ట్రైలర్ కట్ చాలా బాగా వచ్చిందని, ఈ ట్రైలర్ తో అంచనాలు రెట్టింపు అవ్వడం ఖాయమని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.