హెచ్ఎండీఏ పరిధిలో ఒక ఇల్లు ఉండటం సామాన్యుల కోరిక. సొంత ఇల్లు ఉంటే ఎంతో భరోసా ఉంటుందని అనుకుంటారు. అందుకే సిటీలో కలిసిపోతుందని అనుకున్న ప్రాంతాల్లో అయినా కొనుక్కుని హైదరాబాద్లో ఉన్నామని అనుకుని సంతృప్తి పడుతూ ఉంటారు. అందుకే హెచ్ఎండీఏ ప్రాంతాల్లోని గ్రామాల్లో పెద్ద ఎత్తున లే ఔట్లు వెలిశాయి. కాలనీలు అయ్యాయి. ఇక్కడ విషయం ఏమిటంటే హెచ్ఎండీఏ పర్మిషన్లు లేకుండా గ్రామ పంచాయతీ లే ఔట్లే ఎక్కువ. చిన్న చిన్న బిల్డర్లు వీటిని డెవలప్ చేశారు. వీటికి గ్రామ పంచాయతీ అనుమతులే ఉంటాయి. నిబంధనల ప్రకారం ఈ అనుమతులు సరిపోతాయి.
అయితే చాలా మంది గ్రామ పంచాయతీల పేరుతో ఇప్పటికీ మోసాలు చేస్తున్నారు.. పాత తేదీలతో అనుమతులు ఉన్నాయని సృష్టిస్తూ లేఔట్లు వేస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. దీంతో గ్రామ పంచాయతీ లేఔట్లలో కొనడానికి కొంత మంది సందేహిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో చాలా వరకూ మున్సిపాలిటీలుగా మారిపోయాయి. ఔటర్ రింగ్ రోడ్ లోపల పదేళ్లకిందటి వరకూ చాలా పంచాయతీలు ఉన్నాయి. నగరం వేగంగా విస్తరిస్తున్నా పంచాయతీలుగానే ఉంచారు. ఆ సమయంలోనే ఎక్కువ అక్రమాలు జరిగాయి.
పాత తేదీలతో లే ఔట్లు వేసి అమ్మకాలు జరుపుతూండటం అధికారులకు సమస్యగా మారింది. వాటిపై మరింత లోతుగా పరిశీలన చేయాలనుకున్నారు. కానీ రియల్టర్లు మరింత తెలివి మీరిపోయారు. వ్యతిరేక ప్రచారం చేయించి కొనుగోలుదారులలో..కొనుగోలు చేసిన వాళ్లలో భయం పుట్టించారు. పంచాయతీ లేఔట్లులో రిజిస్ట్రేషన్లు ఆపేశారని ప్రచారం చేశారు.దాంతో గగ్గోలు రేగింది. చివరికి.. హెచ్ఎండీఏ క్లారిటీ ఇచ్చింది. రీసేల్ ఇళ్లు కాకుండా… కొత్తవి అయితే హెచ్ఎండీఏ పర్మిషన్లు తీసుకోవడం మంచిదన్న సలహాలు నిపుణులు ఇస్తున్నారు.