మూసీ ఆక్రమిత ఇళ్లల్లో ఉండాలంటూ రేవంత్ చేసిన సవాల్‌ను కిషన్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. అక్కడే పొయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో బీజేపీ బస్తీ నిద్ర పేరుతో కిషన్ రెడ్డితో పాటు ఇతర క్యాడర్ కూడా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పటికే బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్ల కూల్చివేతను వ్యతిరేకించారు. పేదల ఇళ్లు కూల్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ క్రమంలో అక్కడి ప్రజలు దుర్భరమైన జీవితంలో ఉన్నారని మీరు అక్కడ ఉంటే కష్టాలు తెలుస్తాయని రేవంత్ సవాల్ చేశారు. అన్ని ఏర్పాట్లు చేస్తామని మూడు నెలలు అక్కడ ఉండాలన్నారు.
మూడు నెలలు అయితే కష్టం కానీ ఓ రోజు నిద్ర చేయడానికి రెడీ అని బీజేపీ నేతలు సిద్దం అయ్యారు. అంబర్ పేట తులసి రామ్ నగర్ మూసి పేదల నివాసం ప్రాంతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా ముఖ్యనేతలు బస్తీ నిద్ర చేయనున్నారు. కిషన్ రెడ్డితో పాటు, బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, లక్ష్మణ్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఇతర నేతలు మూసి ఏరియాలోని 20 ప్రాంతాల్లో రాత్రి బస చేయనున్నారు.. శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు బీజేపీ నేతలు ఆయా ప్రాంతాల్లో ప్రజలతో కలిసి ఉంటారు.
మూసి విషయంలో వెనక్కి తగ్గేదే లేదని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్, బీజేపీ మాత్రం మూసి ప్రక్షాళన చేయండి కానీ ఇళ్లను మాత్రం కూల్చవద్దని అంటున్నారు. ఆక్రమణలు తొలగించి..మూసిని పూర్తి స్థాయిలో పునరుజ్జీవింప చేస్తేనే ప్రయోజనమని కాంగ్రెస్ వాదిస్తోంది. మూసి ద్వారా మురికి అంతా నల్లగొండమీదకు వెళ్తోందని అక్కడి ప్రజలు విషయం తాగాలా అని ప్రశ్నలు గుప్పిస్తున్నారు. మొత్తంగా మూసి రాజకీయం మరింత ఊపందుకోనుంది.