తమిళనాడులో తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి కేసుల పాలైన నటి కస్తూరి పరారీ అయి చివరికి హైదరాబాద్లోనే అరెస్ట్ అయ్యారు. గచ్చిబౌలిలో ఉన్న ఆమెను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో కూడా ఆమెకు ఊరట దక్కకపోవడంతో పరారీలో ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్నట్లుగా సమాచారం రావడంతో తమిళనాడు పోలీసులు వచ్చి అరెస్టు చేశారు.
తమిళనాడు బీజేపీలో కస్తూరి ఉన్నారు. బీజేపీ తరపున కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రసంగాల్లో దూకుడు చూపించేందుకు వివాదాల పద్దతిని ఎంచుకున్నారు. పూర్తిగా బ్రహ్మిన్ వాయిస్ వినిపించేందుకు తెలుగువారిపై నిందలు వేశారు. తెలుగు వారు తమిళనాడుకు చెలికత్తెలుగా వెళ్లారని అక్కడ స్థిరపడ్డారని.. తమిళనాడు ప్రభుత్వంలో ఆరేడుగురు తెలుగు మంత్రులు ఉన్నారని ఆమె ఆరోపించారు. అలాంటి తెలుగువారిని ఆదరించారు కానీ.. బ్రాహ్మిన్స్ పై మాత్రం వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆమె అంటున్నారు.
ఈ వ్యాఖ్యలు తమిళనాడులో దుమారం రేపాయి. వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. క్షమాపణలు కూడా చెప్పారు. అయినా కేసులు మాత్రం ఆగలేదు. కోర్టు ముందస్తు బెయిల్ కూడా ఇవ్వలేదు. దాంతో ఆమె అరెస్టు భయంతో పారిపోయారు. హైదరాబాద్కు వచ్చారు. ఇటీవల కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్యూలు కూడా ఇవ్వడంతో హైదరాబాద్లో ఉన్నట్లుగా గుర్తించి అరెస్టు చేశారు.