విజయసాయిరెడ్డిపై ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేకు చాలా కోపం వచ్చింది. ఎంత అంటే..తన వారాంతపు ఆర్టికల్ కొత్తపలుకులో దాదాపుగా సగం ఆయనకే కేటాయించారు. ఎందుకంటే.. విజయసాయిరెడ్డి చేసిన ఓ ట్వీట్ ఆయనను హర్ట్ చేసింది. ఇటీవల విజయసాయిరెడ్డిపై ఏబీఎన్‌లో ఏదో ఆరోపణలతో స్టోరీ వేశారు. దాంతో విజయసాయిరెడ్డి ఆర్కేపై పుకార్లుగా ఉన్న అన్నింటినీ కలిపి కథగా రాసి ట్విట్టర్లో పోస్టు పెట్టారు. గతంలో నా జీవితం తెరిచిన పుస్తకం అని ఆర్కే తన పత్రికలోనే ఓ సీరిస్ రాసేశారు. ఇప్పుడు మళ్లీకొత్తగా చెప్పలేను కానీ .ఎవరేంటో తేల్చుకుందాం రమ్మని విజయసాయికే తన సవాల్ విసిరారు.
ఢిల్లీలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే నిర్వహిస్తామని లైవ్ ఇద్దామని.. ఆ లైవ్ సిగ్నల్ సాక్షికి కూడా ఇస్తామని ఆర్కే సవాల్ చేశారు. ఈ సవాల్ కు ముందు విజయసాయిరెడ్డి ఎలాంటి వాడో చెప్పేందుకు కొన్ని ఉదాహరణలు చెప్పారు. జగన్ రెడ్డి తనను దూరం పెట్టారని పలుమార్లు ఆర్కేని కలిసి విజయసాయిరెడ్డి బాధపడ్డారు. నెల రోజుల కిందట కూడా ఆర్కేని కలిశాడట. ఎందుకు కలిశాడనేది చెప్పడం భావ్యం కాదు కాబట్టి చెప్పడం లేదని.. కానీ విజయసాయిరెడ్డి ఎలాంటి వాడో చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఈ విషయం చెబుతున్నానన్నారు.
విజయసాయిరెడ్డి గురించి కొన్ని కొత్త విషయాలను ఆర్కే చెప్పారు. ఆయనను అమిత్ షా ముఖం మీదనే తిట్టారట. నువ్వో మోసగాడివి అని తేల్చేశారట. జగన్ రెడ్డిని ముంచేందుకు కూడాఆయన తెర వెనకున్న కుట్రలు చేస్తున్నారని అర్థం వచ్చేలా ఆర్కే చాలా చెప్పారు. ఆయన జగన్ తో పాటు తనకు ఇబ్బంది అవుతుందని అనుకుంటే ఎవరితో అయినా స్నేహం చేయడానికి రెడీగాఉంటారని అంటున్నారు. విజయసాయిరెడ్డి ట్వీట్లు పెట్టి తర్వాత పై వాళ్ల ఒత్తిడితో పెట్టాల్సి వచ్చిందని వారికి ఫోన్లు చేసి క్షమాపణలు చెబుతారట.
మొత్తానికి విజయసాయిరెడ్డి ట్వీట్ల పైత్యం పాకానికి చేరింది.ఇప్పుడు ఆయన ఆర్కేపై చేసిన ఆరోపణలకు నేరుగా తేల్చుకునే సమయం పచ్చింది. లైవ్ లోకి వస్తే అన్నీ తేల్చుకుందామని అంటున్నారు. మరి విజయసాయిరెడ్డి రెడీ అంటారా లేకపోతే.. మరికొన్ని ఆరోపణలు చేసి అదే సమాధానం అంటారా .. వేచి చూడాల్సిందే.!