ప్రతిపక్షం వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేయడం మామూలే కానీ అసెంబ్లీలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఘాటుగా ప్రశ్నిస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. అలాంటివి ఏపీ అసెంబ్లీలో కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. వైసీపీ ఎలాగూ సభకు రావడం లేదు.అందుకే ఆ పాత్ర కూడా తామే తీసుకుంటున్నారు. జ్యోతుల నెహ్రూతో పాటు కూన రవికుమార్ రెండురోజుల పాటు సభలో అలజడి రేపారు. దీంతో మంత్రులు, స్పీకర్ జోక్యం చేసుకోవాల్సిన వచ్చింది.
క్వశ్చన్ అవర్ జరుగుతున్న సమయంలో కూన రవికుమార్.. సభ డ్రైవర్ లేని బస్సులా సాగుతోందని అనేశారు. ఎందుకంటే సభ్యులు లేవనెత్తుతున్న సమస్యలను ఎవరు రాసుకుంటున్నారో తెలియడం లేదని ఆయన అన్నారు. దాంతో అచ్చెన్నాయుడు వెంటనే కల్పించుకున్నారు. రవికుమార్ఎక్కడో చివరి వరుసలో కూర్చోవడం వల్ల తెలియడం లేదని మంత్రులు రాసుకుటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అంతకు ముందు రోజు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా ఇంతే మాట్లాడారు. ఉచిత ఇసుక విధానంపై విమర్శలు చేశారు. అంతా చేసి తనను ప్రతిపక్షం అనుకోవద్దని..అన్నారు.
ఎక్కువగా ఎమ్మెల్యేలు ఉండటం వల్ల కూడా సమస్యలు వస్తాయి. వారికి పదవులు సర్దుబాటు చేయడం కష్టం అవుతుంది. కూన రవికుమార్, జ్యోతుల నెహ్రూ వంటి వాళ్లు మంత్రి పదవుల్ని ఆశించారు. వారి సీనియార్టీకి, పడిన కష్టానికి ఇవ్వాలి కూడా. కానీ సమీకరణాలు కలసి రాలేదు. దాంతో వారు అసంతృప్తికి గురవుతున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా తమ మాటల్లో వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో చేయడం వల్ల.. ప్రతిపక్షం లేని కొరత కూడా తీరుతున్నట్లుగా అవుతోంది.