వైసీపీ ఎమ్మెల్సీలపై జగన్ కు అనుమానం ప్రారంభమయింది. మెజార్టీ సభ్యులు ఉన్నారని వారిని మండలికి హాజరయ్యేలా అనుమతిస్తే వారు అక్కడ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టకపోగా మరితం సానుకూల ప్రచారం వచ్చేలా చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా వైసీపీలో చర్చ జరుగుతోంది.
సోషల్ మీడియా అరెస్టులపై ప్రభుత్వాన్ని నిలదీస్తారని జగన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తీరా చూస్తే తప్పు ఒప్పుకున్నట్లుగా బొత్స మాట్లాడారు. నారా లోకేష్ తల్లిపై అనుచితంగా మాట్లాడిన వారిని ప్రోత్సహించబోమని ఆయన అన్నారు. అయితే వారికి టిక్కెట్లు ఇచ్చారు కదా అని లోకేష్ మండిపడ్డారు. దీంతో అంబటి రాంబాబు.. మీ తల్లిగారిని అవమానించినట్లుగా నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. దాంతో జగన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోలో సోషల్ మీడియాలో పోస్టు చేశారు టీడీపీ కార్యకర్తలు. రికార్డుల నుంచి తొలగించారు కాబట్టి తాను ఏమీ అనలేదని ఆయన వాదించాలనుకుంటున్నారు. కానీ వీడియోలు ఉంటాయిగా. ఇదంతా బొత్స వల్లే వచ్చిందని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మండలికి వచ్చే బిల్లులు ఆమోదం పొందకుండా చేస్తారని జగన్ అనుకున్నారు. కానీ అలాంటి సూచనలేమీ కనిపించడం లేదు. మండలి చైర్మన్ కూడా వైసీపీకి చెందిన వ్యక్తే అయినా వైసీపీ ఎమ్మెల్యేల కన్నా ఎక్కువగా టీడీపీ సభ్యులే ఫోకస్ అవుతున్నారు. మొత్తంగా మండలిలో తాను అనుకున్న ఎఫెక్ట్ రావడం లేదని.. ఎమ్మెల్సీలు తాను అనుకున్న విధంగా రాజకీయం చేయలేకపోతున్నారని జగన్ ఫీలవుతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
టీడీపీతో కుమ్మక్కవుతున్నారని అనుకుంటే వారిని కూడా శాసనమండలికి వెళ్లకుండా ఆపేస్తారని సెటైర్లు వినిపిస్తున్నాయి.