తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడు అవుతాడనుకుంటున్న ఆటల రాజేందర్ వ్యవహారశైలి ఆ పార్టీ నేతల్లో అనేక సందేహాలకు కారణం అవుతోంది. ఆయన పూర్తిగా బీఆర్ఎస్ ఎజెండాను బీజేపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. మూసి విషయమే కాదు..కలెక్టర్ పై దాడి ఘటనలోనూ ఆయన బీఆర్ఎస్ ఏదంటే..ఆయన కూడా అదే చెబుతున్నారు. పైగా కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఈటల రాజేందర్ హస్తం ఉందన్న ప్రచారమూ జరుగుతోంది.
మూసి విషయంలో బీజేపీ రెండు , మూడు రకాలుగా వ్యవహరించింది. కొంత మంది సమర్థించారు.. కొంత మంది వ్యతిరేకించారు. అయితే ఈటల మాత్రం కేటీఆర్ తరహాలో దూకుడుగా వెళ్లారు. మూసి ప్రాజెక్టులో అవినీతి దగ్గర నుంచి ఇళ్ల కూల్చివేతను వ్యతిరేకించడం వరకూ అంతా బీఆర్ఎస్ నేతలాగానే ప్రకటన చేశారు. కలెక్టర్ పై దాడి ఘటన వ్యవహారంలో అది ప్రజా వ్యతిరేకత అని.. సామాన్యులపై కేసులు పెడుతున్నారని ఆయన ముందుగానే ఆరోపించారు. అదే బీఆర్ఎస్ వాదన. కలెక్టర్ పై దాడి చేయాల్సిన అవసరం లేదని అది కరెక్ట్ కాదని ఆయన చెప్పలేదు.
బీఆర్ఎస్ నుంచి ఆయనను గెంటేసిన తర్వాత ఆయన భూములపై కేసీఆర్ ప్రభుత్వం చేసిన దండయాత్ర ఆయనకు గుర్తు ఉందో లేదో కానీ చాలా మందిఆయనకు సపోర్టు చేశారు. కక్షతోనే ఇదంతా చేస్తున్నారని ఇతర పార్టీల నేతలూ సపోర్టు చేశారు. ఏ ప్రభుత్వంలో అయినా భూసేకరణ ఉంటుంది.. దానిపై వ్యతిరేకతా వస్తుంది. బీఆర్ఎస్ హయాంలో ఫార్మా సిటీ కోసం వేల ఎకరాలు సేకరించారు. రైతులు వ్యతేరికించారు. అలాగే కాళేశ్వరం కోసం ఎన్ని ఎకరాలు సేకరించారో అందరికీ తెలుసు. అయితే నచ్చని వారు కోర్టులకు వెళ్లారు కానీ కలెక్టర్లపై దాడి చేయలేదు.
ఆటల రాజేందర్ కు ఇవన్నీ తెలియక కాదు.. ఆయన బీజేపీలో బీఆర్ఎస్ వాయిస్ వ్యూహాత్మకంగా వినిపిస్తున్నారని దీని వెనుక ఎజెండా ఉందన్న అభిప్రాయం మాత్రం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.