ఒకప్పుడు బాలీవుడ్ లో నిలబడడానికి తెలుగు హీరో నానా కష్టాలూ పడ్డారు. మంచి సినిమాలు తీసినా, అక్కడ చూసేవాడే లేడు. తెలుగు సినిమాని సపోర్ట్ చేయడానికి ఎవరూ ముందుకొచ్చేవారు కాదు. సౌత్ హీరోలంటే ఎలాగూ చిన్నచూపు ఉండేది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా?! సౌత్ స్టామినా ఏమిటో, తెలుగు హీరోల సత్తా ఏమిటో ఈతరం నిరూపించేసింది. బాలీవుడ్ హీరోలకు తలదన్నే క్రేజ్‌ని సంపాదించారు మన వాళ్లు. నిలబడడానికి చోటు కోసం చూసిన టాలీవుడ్ ఎప్పుడు ఏకంగా సింహాసనం వేసుకొని మరీ కూర్చుంది.
బాహుబలితో ప్రభాస్ హిందీ హీరో అయిపోయాడు. ఆ తరవాత తన నుంచి వచ్చిన సాహో, సలార్, కల్కి చిత్రాలకు బాలీవుడ్ లో విపరీతమైన స్పందన వచ్చింది. సౌత్ హీరో అంటే అక్కడి వాళ్లకు గుర్తొచ్చేది ప్రభాసే. ఇప్పుడు అల్లు అర్జున్ పేరు బాలీవుడ్ లో మార్మోగిపోతోంది. పుష్ప తో బన్నీ నార్త్ లో క్రేజ్ సంపాదించుకొన్నాడు. పుష్ష 2కి ఆ క్రేజ్ చాప కింద నీరులా విస్తరించింది. ఇప్పుడు మహా సముద్రమై పోటెత్తుతోంది. పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వస్తున్న స్పందన చూస్తే… బాలీవుడ్ కి సైతం పిచ్చెక్కిపోవాల్సిందే. పాతిక వేల పాసులు హుష్ కాకి అంటూ ఎగిరిపోయాయి. పాట్నాలో తెలుగువాళ్ల సంఖ్య చాలా తక్కువ. అలాంటి చోట బన్నీ క్రేజ్ చూస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే. సోషల్ మీడియా మొత్తం పుష్ష హవానే. రిలీజ్ అవుతోంది సినిమానా, ట్రైలరా? అన్నంత రేంజ్ లో ఉంది ఈ బజ్. ట్రైలర్ కే పాన్ ఇండియా ఇలా ఊగిపోతోంటే, ఇక సినిమా రిలీజ్ టైమ్ లో ఎలా ఉంటుందో..!
ఓ సౌత్ ఇండియన్ సినిమాకి, అందునా తెలుగు సినిమాకీ నార్త్ లో ఇలాంటి ఆదరణ నభూతో.. నభవిష్యత్. ప్రభాస్ తరవాత బాలీవుడ్ ని అంతగా ప్రభావితం చేసిన సౌత్ ఇండియన్ స్టార్ కచ్చితంగా బన్నీనే. వీరిద్దిరిలో ఆధిక్యం ఎవరిది అనేది పుష్ప 2 కలక్షన్లే చెప్పాలి. ఏది ఏమైనా తెలుగు సినిమాకు ఇది శుభతరుణం. తెలుగువాళ్లుగా మనం గర్వించదగిన సమయం. సినిమా ప్రాంతాలను, సరిహద్దుల్ని చెరిపివేస్తోందని చెప్పడానికి ఇదో బలమైన సాక్ష్యం. ప్రభాస్, అల్లు అర్జున్ లా… బాలీవుడ్ ని కదిలించే సత్తా మన హీరోల్లో చాలామందికి ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్.. ఈ బాటలోనే ప్రయాణం చేయాలి. సరైన ప్లానింగ్, బజ్ క్రియేట్ చేయడంలో తెలివితేటలు ఉంటే.. అదేమంత కష్టమైన విషయం కూడా కాదు. అదెలాగో తెలియాలంటే పుష్ప సినిమా ప్రమోషన్ సరళిని మిగిలిన వాళ్లు ఓ సిలబస్‌లా ఫాలో అవ్వాలి.