తెలంగాణ బీజేపీకి పెద్ద చిక్కు వచ్చి పడింది. జైలుకు పోవాల్సిన రేవంత్ ను బీజేపీ కాపాడుతోందని కేటీఆర్ అంటున్నారు. అదే మాటను కాంగ్రెస్ అంటోంది. అవినీతి చేసి అడ్డంగా దొరికిన కేటీఆర్ గురించి ఆధారాలతో సహా గవర్నర్ ముందు పెట్టినా అరెస్టుకు పర్మిషన్ ఇవ్వడం లేదని కాంగ్రెస్ అంటోంది. ఈ ఇద్దరి ఆరోపణల మధ్య బీజేపీ నలిగిపోతోంది. నిజంగానే మేము ఇద్దర్నీ కాపాడుతున్నామా అని ఆ పార్టీ క్యాడర్ కూడా ముందూ వెనుకా చూసుకోవాల్సిన పరిస్థితి.
కేటీఆర్ ఇటీవల ఢిల్లీ వెళ్లారు. అమృత్ టెండర్ల మీద ఫిర్యాదు చేశారు. ఇక అరెస్టే మిగిలిందని అంటున్నారు . కానీ ఇలాంటి తలాతోక లేని ఫిర్యాదులు చేసి వచ్చి బీజేపీ చర్యలు తీసుకోవడం లేదని అంటే ఎలా అన్న సందేహం చాలా మందికి వస్తుంది. కానీ అవినీతి జరిగిపోయిందని తాము తేల్చేశాం కాబట్టి.. ఇక అరెస్టు చేయడం బీజేపీ బాధ్యత అని చేయడం లేదు కాబట్టి రేవంత్ రెడ్డిని బీజేపీ కాపాడుతున్నట్లేనని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేటీఆర్ నేరుగా ట్వీట్లు పెడుతున్నారు.
కాంగ్రెస్ నేతలు మాత్రం.. గవర్నర్ ఏదో ఏసీబీకి ఆ పర్మిషన్ ఇచ్చి ఉంటే ఈ పాటికి అరెస్టు అయి ఉండేవారని కానీ ఆ పర్మిషన్ గవర్నర్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ ఢిల్లీ వెళ్లి బీజేపీ తో డీల్ కుదుర్చుకుని వచ్చారని అంటున్నారు. కానీ కేటీఆర్ మాత్రం రివర్స్ లో బీజేపీ పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తానికి బీజేపీ మెడకు చుట్టుకుంటోంది. రెండు పార్టీలు కలిసి బీజేపీనే బ్లేమ్ చేస్తున్నాయి. బండి సంజయ్ లాంటి బీజేపీ నేతలు మాత్రం… నిరూపించాలని సవాళ్లు చేస్తున్నారు.