విశ్వక్సేన్కి కొంచెం స్పీడ్ ఎక్కువ. తన సినిమా ప్రమోషన్లను బాగా చేసుకొంటాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో, ఇంటర్వ్యూలలో, ప్రెస్ మీట్లలో ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తాడు. ‘ఈ సినిమా గనుక ఆడకపోతే.. నా పేరు మార్చుకొంటా’ అంటూ ఓవర్ ది బోర్డ్ స్టేట్మెంట్లు కూడా ఇస్తుంటాడు. అయితే సినిమా ఫ్లాప్ అయితే, పేర్లు మార్చుకోవడం గట్రా ఏం చేయలేదనుకోండి. ఎప్పటి ముచ్చట అప్పటిదే అన్నట్టు విశ్వక్ సేన్ స్పీచ్‌లు తయారవుతుంటాయి.
ఇప్పుడు తన నుంచి ‘మెకానిక్ రాఖీ’ సినిమా వస్తోంది. ఈనెల 22న విడుదల కానుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎప్పటిలా చెలరేగిపోయాడు విశ్వక్సేన్. ముందుగా ట్రోలర్స్ పై పడ్డాడు. తానేదో సినిమా ప్రమోషన్లలో కాస్త జోష్ మీద మాట్లాడితే, అదే ముక్క అటు తిప్పి ఇటు తిప్పి వేస్తారు. ‘మీరు నన్నేం పీకలేరం’టూ… కాస్త బోల్డ్ గా స్టేట్ మెంట్ ఇచ్చాడు. రివ్యూవర్లకు ‘వీపులు పగులుతాయ్’ అంటూ హెచ్చరికలు జారీ చేశాడు. సినిమా గురించి ఏదైనా రాసుకోండి, కానీ పర్సనల్ విషయాల జోలికి రాకండి అంటూ వార్నింగు ఇచ్చాడు. అయితే అంతలోనే… రివ్యూవర్లపై తనకు గౌరవం ఉందని, చిన్నచూపు లేదని, వాళ్లకు నచ్చేలా సినిమాలు తీస్తానని, కానీ రాసేటప్పుడు రివ్యూవర్లు కూడా బాధ్యతగా ఉండాలంటూ హితవు పలికాడు. ఇక మీదట ఎప్పుడూ రివ్యూవర్ల గురించి మాట్లాడడని ఈ వేదికపై నుంచి మాట ఇచ్చేశాడు.
ప్రతీ సినిమాకూ ఛాలెంజ్ చేయడం విశ్వక్సేన్ కు అలవాటు. ఈ సినిమా కోసం కూడా అలాంటి ఛాలెంజ్ ఏదో చేస్తాడనుకొన్నారంతా. కానీ ఈసారి రివర్స్ గేర్‌లోకి వెళ్లాడు. ”సినిమా ఫ్లాప్ అయితే చెక్ పోస్ట్‌లో షర్టు లేకుండా తిరుగుతా. జూబ్లీ హిల్స్ లో ఇల్లు ఖాళీ చేస్తా అనే ఛాలెంజ్‌లు విసరను. సినిమా ఆడినా ఆడకపోయినా నా చొక్కా నా ఒంటిపైనే ఉంటుంది. నా ఇల్లు జూబ్లీ హిల్స్ లోనే ఉంటుంది” అంటూ కాసేపు కామెడీ చేశాడు. అయితే సినిమా తాను చూసుకొన్నాడట. బాగా వచ్చిందన్న నమ్మకం ఉందన్నాడు విశ్వక్. మొత్తానికి తన స్పీచ్‌తో మరోసారి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకొన్నాడు విశ్వక్. సినిమా విడుదలకు ముందు విశ్వక్ ఎప్పుడూ ఎలాంటి బజ్ కోరుకొంటాడో, అలాంటి బజ్ తన స్పీచ్ తో తీసుకొచ్చాడు విశ్వక్. ఆరకంగా తన ప్రయత్నం సక్సెస్ అయినట్టే.