ఇండస్ట్రియల్ క్లస్టర్ కోసం కొడంగల్ నియోజకవర్గంలో భూసేకరణ చేయాలనుకోవడం.. దానికి కలెక్టర్ పై దాడి ఘటనతో వస్తున్న ప్రచారం.. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న హడావుడిని కాంగ్రెస్ నేతలు ఎదుర్కోవడంలో విఫలమవుతున్నారు. పదేళ్ల పాటు తెలంగాణ లో ప్రభుత్వం నడిపిన బీఆర్ఎస్ మాటకు ముందు భూసేకరణ జరిపింది. ఆ తర్వాతే ప్రాజెక్టుల గురించి ఆలోచించింది. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టడంలో కాంగ్రెస్ తడబడుతోంది.
ఏ ప్రభుత్వమైనా పరిశ్రమల అవసరాలు భూములు సేకరించడం సహజమే. అయితే వారికి అన్యాయం జరగకుండా మంచి ప్యాకేజీని ఇవ్వాలి. ఇందు కోసం కేంద్రం చట్టం చేసింది. ఒక వేళ ప్రభుత్వం ఇవ్వాలనుకున్న ప్యాకేజీని నచ్చకపోతే కోర్టుకు పోవచ్చు. గతంలో బీఆర్ఎస్ హయాంలో పరిశ్రమల కోసం.. సిటీలకోసం…. కాళేశ్వరం కోసం సేకరించిన భూమితో పోలిస్తే.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కొడంగల్లో సేకరించాలనుకున్న భూమి పిసరంత. బీఆర్ఎస్ హయాంలో సేకరించిన భూములపై హైకోర్టులో వందల కొద్దీకేసులు ఉన్నాయి. న్యాయం చేయలేదన్న ఉద్దేశంతో కలెక్టర్లకు శిక్షలు కూడా పడ్డాయి.
అలాంటి ప్రభుత్వం నడిపిన వారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలో ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇండస్ట్రియల్ క్లస్టర్ పెట్టేందుకు ప్రయత్నిస్తూంటే… సీఎం భూముల్ని దోచేస్తున్నాడని .. ఆయన సోదరుడు ఫార్మా పరిశ్రమ పెడతాడని చెప్పి రెచ్చగొట్టేస్తున్నారు. దీని వల్ల జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి కానీ.. తెలంగాణకు అంత మంచిది కాదన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణకు పరిశ్రమలు రాకుండా చేసేలా బీఆర్ఎస్ రాజకీయాలు ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం వర్గాలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రచారాన్ని ఖండించడంలో విఫలమయ్యారు. అక్కడ పెట్టాలనుకున్న పరిశ్రమలేమిటి.. అక్కడ ఉన్న భూములేమిటి… పంటలు పండుతాయా.. బీడు భూములు తీసుకుంటున్నారా.. ఎంత పరిహారం ఇస్తున్నారు… ఎలా న్యాయం చేస్తున్నారు లాంటి విషయాలపై అవగాహన కల్పించడంలో వెనుకబడిపోయారు. ఫలితంగా ఊరకనే భూములు లాక్కుంటున్నారని బీఆర్ఎస్ ప్రచారం చేయగలుగుతోంది.