హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తాజాగా మాస్టర్ ప్లాన్ ను ప్రకటించింది. వరంగల్ , హన్మకొండతో పాటు వందకుపైగా గ్రామాలు కలిపి ఈ మాస్టర్ ప్లాన్ కు ఆమోద ముద్ర వేశారు. సీఎం రేవంత్ అధికారికంగా వరంగల్ విషయంలో తాము ఏం చేయబోతున్నామో ప్రకటించబోతున్నారు. వరంగల్ ఎయిర్ పోర్టుకు అవసరమైన భూసేకరణకు నిధులు కూడా మంజూరు చేశారు.
వరంగల్ నగరంలో జనాభా ఎప్పటికప్పుడు పెరుగుతున్నా .. ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నా ఇంకా అభివృద్ధిలో వెనుకబడే ఉంది. ఆ నగరానికి మాస్టర్ ప్లాన్ ప్రకటించి ఆ ప్రకారం అభివృద్ధి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్న అంచనాలు చాలా కాలంగా ఉన్నాయి. గత బీఆర్ఎస్ హయాంలోనే మాస్టర్ ప్లాన్‌కు అవసరమైన ప్రక్రియ పూర్తి చేశారు. అభ్యంతరాలు స్వీకరించారు. కానీ ప్రకటించలేదు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత విస్తృతమైన ఆలోచనలు చేసి మాస్టర్ ప్లాన్ 2041 ఖరారు చేశారు.
వచ్చే ఎన్నికలలోపు వరంగల్‌లో అద్భుతమైన అభివృద్ధి చూపించి.. రెండో రాజధానిగా ప్రకటించే అవకాశం ఉంది. ఎయిర్ పోర్టును కూడా ఆ లోపే పూర్తి చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గించేలా.. వరంగల్ అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. అదే విధంగా ఈ రెండు పట్టణాల మధ్య రవాణా సౌకర్యాలను పెంచనున్నారు.