దేవాదాయ శాఖ ఉద్యోగిని శాంతి విషయంలో విజయసాయిరెడ్డి తనపై ఆరోపణలు వచ్చినప్పుడు చాలా ఆవేశపడ్డారు. తనకు ఓ టీవీ చానల్ లేకపోవడం వల్లనే ఇన్ని సమస్యలు వస్తున్నాయని ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. గతంలో టీవీ చానల్ పెట్టేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా జగన్ రెడ్డి వద్దనడంతోనే ఆగిపోయానని ఈ సారి మాత్రం ఎవరు చెప్పినా ఆగబోనని చానల్ పెట్టేస్తానని సవాల్ చేశారు.
సాక్షి మీడియా కూడా తన వాదనను వినిపించడం లేదన్న ఆవేదన ఆయనలో ఉంది.అందుకే సొంత చానల్ ప్రస్తావన తీసుకు వచ్చారు. జగన్ రెడ్డి అడ్డంపడినా సరే చానల్ పెట్టేస్తానని ప్రకటించిన ఆయన ఇప్పటి వరకూ ఆ విషయంలో ముందడుగు వేయలేకపోయారు.కానీ చానల్ లేకపోవడం వల్ల ఆయన పడే కష్టాలు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. తన వాదనను ఆయన గట్టిగా వినిపించలేకపోతున్నారు. ట్విట్టర్లో పెద్ద పెద్ద కథలు రాసినా ప్రయోజనం ఉండటం లేదు.
మరో వైపు చానల్ ఉందని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే తనపై ఆరగంటకుపైగా ఆరోపణలు చేశారు. అవి నేరుగా చేశారు. అమిత్ షా ఏమిని తిట్టారో..తనను తరచుగా కలుస్తున్నారని కూడా చెప్పారు. ఓపెన్ డిబేట్ కు రావాలని చాలెంజ్ చేశారు. నిజంగా విజయసాయిరెడ్డి చేతిలో చానల్ ఉండి ఉంటే ఆయన రోజంతా ఆర్కే గురించి కథలు చెప్పించేవారు. అది లేకపోవడం వల్ల తనపై పడే బురద ఎక్కువైపోతోంది. తుడుచుకోలేకపోతున్నారు.
అయినా చానల్ ను ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారో ఆయన వీరాభిమానులకు అర్థం కావడం లేదు. మళ్లీ జగన్ వద్దంటున్నారా లేకపోతే ఆర్థిక సమస్యలు ఉన్నాయా ?. విజయసాయిరెడ్డి ఆర్థిక సమస్యలనేవి మాట ఉండదు. మరి మళ్లీ జగనే అడ్డం పడుతున్నారా ?