చాలామంది అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ వైరి వర్గాలే. వాళ్ల ఫ్యాన్స్ నువ్వా? నేనా? అంటూ సోషల్ మీడియా సాక్షిగా తలపడుతుంటారు. అయితే వీరిద్దరూ ఇప్పుడు ఒకేసారి నార్త్ లో తమ పవరేంటో చూపించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలు పవన్ కల్యాణ్ స్టామినాకు అద్దం పడితే, ‘పుష్ప 2’ ట్రైలర్ లాంచ్… బన్నీకి నార్త్‌లో ఉన్న ఇమేజ్ ఎలాంటిదో చూపించింది. ఓరకంగా.. పవన్, బన్నీ ఫ్యాన్స్ ఇద్దరికీ ఇది పెద్ద బూస్టప్ అని చెప్పొచ్చు.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం కోసం పవన్ కల్యాణ్ రెండు రోజులు కేటాయించారు. ఈ రెండ్రోజులు పవన్ సభలకు జనం కిక్కిరిసిపోయారు. ఏపీలో పవన్ రోడ్ షోకి ఎంతమంది అభిమానులు వస్తారో… అక్కడ అంతమంది కనిపించారు. లోకల్ లీడర్లు వచ్చినా రాని క్రౌడ్.. పవన్ కోసం తరలివచ్చారు. పవన్ కల్యాణ్‌కి నార్త్‌లోనే ఇంత ఉంటే, ఇక ఏపీలో ఇంకెంత ఉంటుందో అని స్థానిక మహారాష్ట్ర నాయకులే ఆశ్చర్యపోయారు. పైగా పవన్ మరాఠీలో ఇచ్చిన స్పీచ్‌కు స్థానికులు కూడా ఫిదా అయిపోయారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తే – ఆ విజయంలో పవన్ కూడా భాగం పంచుకొన్నట్టే.
ఇక ‘పుష్ప 2’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నాలో జరిగింది. ఓ తెలుగు సినిమా ఈవెంట్ ని పాట్నాలో నిర్వహించడం ఇదే తొలిసారి. పైగా… ఇది అవుడ్డోర్ ఈవెంట్. ఇందుకోసం పాతిక వేల పాస్‌లు జారీ చేశారు. అయితే బన్నీని చూడడానికి దాదాపు 2 లక్షలమంది అభిమానులు వచ్చారు. రోడ్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. బన్నీ ఎయిర్ పోర్ట్ నుంచి సభా వేదికకు వచ్చే దారంతా అభిమానులు అభివాదం చేస్తూనే ఉన్నారు. ఓ తెలుగు హీరోకి నార్త్ లో దక్కిన అపూర్వమైన ఆదరణ ఇది. భవిష్యత్తులో నార్త్ ఇండియాలో ప్రమోషన్లు నిర్వహించాలనుకొనేవాళ్లందరికీ ఈ ఈవెంట్ ఓ గైడ్‌లా ఉపయోపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవైపు పవన్..రాజకీయంగా నార్త్ లో అలజడి సృష్టిస్తే, మరోవైపు తన సినిమాతో బన్నీ అదరగొట్టాడు. ఓరకంగా ఈ విషయంలో ఇద్దరు మెగా హీరోలూ విజయం సాధించినట్టే.