నిన్న మొన్నటి వరకూ నిస్తేజంగా కనిపించిన కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మల్లన్న సాగర్ రూపంలో స్వయంగా ప్రభుత్వమే ప్రతిపక్షాలకు విమర్శల బాంబులు పేల్చడానికి మందుగుండు సామగ్రిని సరఫరా చేసినట్టయింది. నష్ట పరిహారం వ్యవహారంపై చాలా మంది రైతులు అసంతృప్తితో ఉన్నారు. వారికి కాంగ్రెస్, టీడీపీ, జేఏసీ నేతలు అండగా నిలిచారు. ఈ ప్రాజెక్టు వ్యవహారంలో ప్రభుత్వం పూర్తి డిఫెన్స్ లో పడిందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందుకే దాడిని తీవ్రతరం చేయాలని నిర్ణయించినట్టున్నారు.
మల్లన్న సాగర్ కు వెళ్లే ధైర్యం ముఖ్యమంత్రి కేసీఆర్ కు గానీ మంత్రులకు గానీ లేదని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. బాధిత రైతుల ముందుకు వెళ్లడానికి ప్రభుత్వానికి ధైర్యం లేదని విమర్శించారు. పరిహారం విషయంలో ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందని ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు. తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. పులిచింతలతో మల్లన్న సాగర్ ను పోలిస్తే మంచిగుండదని హెచ్చరించారు. పులిచింతల ముంపు బాధితులకు అన్ని విధాలుగా పరిహారం అందించామన్నారు.
వరసగా తమ పార్టీ ఎమ్మెల్యేలు తెరాస లోకి ఫిరాయించడం, అంతర్గత కలహాలతో కాంగ్రెస్ చాలా కాలంగా నిస్తేజంగా కనిపించింది. కానీ మల్లన్న సాగర్ వివాదంతో ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకు పడటానికి అవకాశం లభించింది.
అసలు మల్లన్న సాగర్ వెళ్లడానికి కేసీఆర్ కు ధైర్యం లేదనేది అతిపెద్ద ఆరోపణ. దీనికి ఆయన ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే, నిజంగానే ఆయన మల్లన్న సాగర్ వెళ్తే కాంగ్రెస్ కు చెక్ పెట్టినట్టు అవుతుంది. కానీ అక్కడ ఆక్రోశంతో ఉన్న రైతులు ఎలా స్పందిస్తారో తెలియదు. కాబట్టి ఈ సమయంలో వెళ్లడం రిస్క్ అనేది ఒక అభిప్రాయం. ఒక వేళ వెళ్లకపోతే కాంగ్రెస్ వారు మరీ రెచ్చపోయే అవకాశం ఉంది. ఇది మరొక వాదన.
రైతులు కోరిన విధంగానే పరిహారం ఇస్తామని హైకోర్టుకు ప్రభుత్వం విన్నవించింది. కేసీఆర్ ప్రభుత్వం కూడా భూసేకరణ చట్టం, 123 జీవోల్లో రైతులు కోరుకున్న దాని ప్రకారం పరిహారం ఇస్తామంటున్నారు. అయితే భూముల విలువను పెంచిన తర్వాతే పరిహారం చెల్లించాలనేది ప్రతిపక్షాల డిమాండ్.
విషయం హైకోర్టు వరకూ వెళ్లింది. ప్రాజెక్టు వివాదంపై పిటిషన్ ను హైకోర్టు కొట్టేసిందని ప్రభుత్వం సంబరపడే పరిస్థితి లేదు. ఎందుకంటే, రైతుల నుంచి బలవంతంగా భూసేరణ చెయ్యం, వాళ్లు కోరుకున్న పద్ధతిలోనే పరిహారం ఇస్తామని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు హామీ ఇచ్చారు. ఆ తర్వాతే పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. కాబట్టి ఆ ప్రకారం పరిహారానికి సిద్ధం కావాల్సిందే. చివరకు కాంగ్రెస్, టీడీపీ, జేఏసీల మాట నెగ్గే పరిస్థితి వచ్చినా ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించక తప్పదు. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారనేది కాకుండా రైతులకు మేలు జరలాగనేదే అందరి ఉద్దేశం. కాబట్టి, విపక్షాలది పైచేయి అవుతుందని అనిపించినా, కేసీఆర్ ప్రభుత్వం మెట్టు దిగక తప్పదేమో.