తిరుమలలో శారదాపీఠానికి టీటీడీ ఇచ్చిన స్థలానికి మరికొంత కబ్జా చేసి..నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన భారీ భవనాన్ని స్వాధీనం చేసుకుని కూల్చివేయాలని టీడీడీ బోర్డు నిర్ణయించింది. తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి తొలి సమావేశం అన్నమయ్యభవన్ లో జరిగింది.ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వంలో టీటీడీలో స్వరూపానంద చక్రం తిప్పారు. తమ పీఠానికి భూమి కేటాయించుకోవడంతో పాటు మరికొంత కబ్జా చేసి ఇష్టారీతిన నిర్మాణాలు చేశారు.
ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఆయన చేసిన అక్రమాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రూ. 250 కోట్లకుపై విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు తిరుమలలోని భవనాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. నిజానికి తిరుమలలో ఎవరికి భూమి కేటాయించినా వారు భవనం నిర్మించి టీటీడీకి అప్పగించేయాలి. కానీ కొంత మంది మాత్రం తమ అధీనంలోనే ఉంచుకుటున్నారు. మఠం పేరుతో తమ అధీనంలోనే ఉంచుకోవాలని స్వరూపానంద చేసిన ప్రయత్నాలకు టీటీడీ బోర్డు చెక్ పెట్టింది.
తొలి పాలక మండలి సమావేశంలో చాలా కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. కొండపై రాజకీయాలు మాట్లాడే అంశాన్ని నిషేధించారు. అలాగే శ్రీవారి ట్రస్టును రద్దు చేశారు. అయితే శ్రీవాణి దర్శనాలను కొనసాగిస్తారు. ఆ నిధులన్నీ టీటీడీ ఖాతాకే జమ అవుతాయి. ఇప్పటి వరకూ వీఐపీ దర్శన టిక్కెట్లను రూ. పదివేలకు అమ్ముకుని ట్రస్టుకు తరలించేవారు. ఆలయాలకు ఖర్చు పెడుతున్నామని చెప్పేవారు. కానీ అందులో భారీ అవినీతి ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.
సామాన్య భక్తులకు రెండు, మూడు గంటల్లోనే దర్శనం కల్పించేలా మార్పులు చేసేందుకు చర్యలు చేపట్టింది. కంపార్ట్మెంట్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించింది. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను వీఆర్ఎస్ లేదా ప్రభుత్వ శాఖల్లోకి బదిలీ చేయాలని నిర్ణయించింది. సామాన్య భక్తులకు మూడు, నాలుగు గంటల్లో దర్శనం అయ్యేలా చేస్తే..అంత కంటే గొప్ప నిర్ణయం టీటీడీ బోర్డు చరిత్రలో ఉండదని అనుకోవచ్చు.