‘పుష్ప 2’ విడుదల దగ్గర పడుతున్న కొద్దీ – హైప్ పెరుగుతూ పోతోంది. ట్రైలర్‌తో అంచనాలు ఆకాశానికి తాకాయి. మిగిలిన పాటలెలా ఉంటాయి? ముఖ్యంగా ఐటెమ్ గీతం ఏ స్థాయిలో పేలుతుంది? అనే దానిపై ఫ్యాన్స్ దృష్టి పెట్టారు. మరోవైపు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులు కూడా దాదాపుగా పూర్తికావొచ్చాయని తెలుస్తోంది. ఫస్టాఫ్ వరకూ తమన్ పూర్తి చేశాడు. మిగిలిన భాగాన్ని అజనీష్ లోక్ నాథ్, శ్యాం సి.ఎస్ పంచుకొన్నారు.
అయితే.. దేవిశ్రీ ప్రసాద్ కూడా తన వంతు వెర్షన్ పూర్తి చేశాడని తెలుస్తోంది. సినిమా మొత్తానికి దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం అందించేశాడట. అది ఓ వెర్షన్. తమన్, అజనీష్, శ్యాం సి.ఎస్ ఇచ్చింది మరో వెర్షన్. అంటే.. ఈ సినిమా కోసం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ల వెర్షన్లు రెండు రెడీగా ఉన్నాయన్నమాట. వీటిలో ఏది ఫైనల్ అవుతుందన్నది సుకుమార్ చేతుల్లో ఉంది. నిజానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం మరో ముగ్గురు సంగీత దర్శకుల్ని తీసుకోవడం సుక్కుకు కూడా ఇష్టం లేదని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. కేవలం నిర్మాతల ఒత్తిడితోనే సుకుమార్ తమన్, శ్యామ్, అజనీష్లను జట్టులో చేర్చుకొన్నాడని తెలుస్తోంది. ఫైనల్ గా సుక్కు కూడా దేవి వెర్షన్ ని విడుదల చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదట. అంతెందుకు… ట్రైలర్ కు సైతం ఇలా మూడు వెర్షన్లు చేయించాడు. ఓ వెర్షన్‌కి దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తే, మరో వెర్షన్ కు తమన్, ఇంకోదానికి శ్యామ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చార్ట. చివరకి దేవిశ్రీ ఇచ్చిన వెర్షన్ విడుదల చేశారు. రేపు సినిమా విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందని అనుకొంటున్నారు. అంతేమరి.. దేవిపై సుక్కుకి ఉన్నది మామూలు ప్రేమా? ఆ అనుబంధం ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనే బయటపడుతుంది.