మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ .. మంత్రి కొల్లు రవీంద్రపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మైలవరం లో మైనింగ్ లో అక్రమాలు జరిగాయని అందులో గత ఎమ్మెల్యే హస్తం ఉందని మంత్రి శాసన మండలిలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తనను ఉద్దేశించే అన్నారని వసంత కృష్ణ ప్రసాద్ ఫీలయ్యారు.
కొల్లు రవీంద్ర వ్యాఖ్యలతో సభలో నా పరువుకు భంగం కలిగిందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మైలవరం లో జరిగిన మైనింగ్ అక్రమాల్లో తన పేరు ఎప్పడు రాలేదన్నారు. అధికారులు ఏ కేసులో కూడా నా పేరు పెట్టలేదని గుర్తు చేశారు.
అయినా కూడా అక్రమాల్లో నా శాతం ఉందని మంత్రి ప్రకటించడం సరికాదన్నారు. అయితే ఈ అంశంపై కొల్లు రవీంద్ర వెంటనే వివరణ ఇచ్చారు. తాను పోలవరం కాలువల మట్టి తవ్వకాల అక్రమాల్లో ఒక మాజీ శాసన సభ్యుడి పాత్ర ఉందన్నానని చెప్పానని మైలవరం గత ఎమ్మెల్యే అని కాదని వివరణ ఇచ్చారు. వసంత కృష్ణప్రసాద్ గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మైలవరం నియోజకవర్గంలో మైనింగ్ అక్రమాలు జరిగాయని మాజీ మంత్రి దేవినేని ఉమ పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు.
అయితే రాజకీయ పరిణామాలు మారి చివరికి కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అలవాట్లో పొరపాటుగా సభలో ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలతో ఆయన ఇబ్బందికి గురయ్యారు. అయితే మాజీ ఎమ్మెల్యేను అన్నానని జోగి రమేష్ గురించి తాను చెప్పినట్లుగా కొల్లు రవీంద్ర క్లారిటీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగినట్లయింది.