2025 సంక్రాంతి బెర్తులు అప్పుడే ఫుల్ అయిపోయాయి. మూడు సినిమాలు ఈ పండక్కి రాబోతున్నాయి. గేమ్ ఛేంజర్ జనవరి 10న వస్తుంటే బాలకృష్ణ సినిమా ‘డాకూ మహారాజ్’ 12న విడుదల కానుంది. 14న వెంకటేష్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫిక్సయ్యే అవకాశాలు ఉన్నాయి.
వాస్తవం చెప్పాలంటే.. ఈ మూడింటితో పాటుగా కనీసం మరో పెద్ద సినిమాకు చోటుంది. 4 సినిమాల్ని ఈ సీజన్లో విడుదల చేసుకోవొచ్చు. కానీ ఈసారి ఈ మూడింటితోనే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సందీప్ కిషన్ ‘మజాకా’ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకొద్దామనుకొన్నారు. దాంతో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘భైవరం’ కూడా సంక్రాంతికి విడుదల చేద్దామనుకొన్నారు. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలూ డ్రాప్ అయినట్టు తెలుస్తోంది. తమిళం నుంచి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ విడుదల కానుంది. అజిత్ నటించిన సినిమా ఇది. తనకు తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు. మాస్ ఫాలోయింగ్ కూడా అంతంత మాత్రమే. సినిమా బాగుంటే తప్ప, థియేటర్లకు వెళ్లరు. కాబట్టి అజిత్ సినిమాను పోటీగా చూడడం లేదు. మూడు సినిమాలంటే… టాలీవుడ్ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా కుదిరినట్టే. పైగా మూడు సినిమాలూ వేటికవే సెపరేట్ జోనర్లు. గేమ్ ఛేంజర్ ఓ పొలిటికల్ థ్రిల్లర్. బాలయ్యది యాక్షన్ ధమాకా. వెంకటేష్‌ది ఫ్యామిలీ మార్క్ ఎంటర్టైనర్. ఇందులో రెండు సినిమాలు దిల్ రాజు బ్యానర్ నుంచే వస్తున్నాయి.
జనవరి 26 కూడా మంచి డేటే. సంక్రాంతికి రావాలనుకొని మిస్సయిన సినిమాలు.. జనవరి 26ని టార్గెట్ చేస్తాయి. మజాకా, భైరవం చిత్రాలకు ఈ డేట్ అనువుగా ఉంది.