దేవదేవుని ఒక్క క్షణం దర్శనం కోసం ఖండాంతరాలు దాటి భక్తులు వస్తారు. పలుకుబడి ఉన్న వాళ్లు నేరుగా దర్శనం చేసుకుంటారు. డబ్బులున్న వారికి రూ. పదివేల ఐదువందలు తీసుకుని వీఐపీ దర్శనం చేయిస్తారు. మరి సామాన్యుల సంగతేమిటి?. వారు కొండపై పడిగాపులు పడాలి. కంపార్టుమెంట్లలో గేట్లుతీసే వరకూ ఎదురు చూడాలి. రద్దీ సమయాల్లోఅయితే కనీసం ఇరవై నాలుగు గంటలు పడుతుంది. భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ ఈ సమయం కూడా పెరిగిపోతోంది. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు కొత్త టీటీడీ బోర్డు వినూత్న ప్రయత్నాలు చేయాలని నిర్ణయించింది.
కొండపైకి వచ్చే భక్తులకు రెండు, మూడు గంటల్లో శ్రీవారి దర్శనం అయ్యేలా చూసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహకారం తీసుకోవాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం ఐఐటీలతో పాటు నిపుణులను కూడా సంప్రదించనుంది. వారు అన్ని పరిశీలించిన తర్వాత ఎంత మంది భక్తులు వస్తారులా. దర్శన్ అవకాశం కల్పించాలన్నదానిపై ఓ నివేదిక ఇస్తారు. నిజానికి కొండపై లక్ష మంది వచ్చినా రెండు, మూడు గంటల్లో దర్శనం కల్పించడం సాంకేతికతో సాధ్యమేనన్న అభిప్రాయం ఉంది.
లఘు దర్శనం, మహాలఘుదర్శనం పేరుతో గతంలో దర్శనాలు ఉండేవి. ఇప్పుడు అంతా మహాలఘు దర్శనమే అమలు అవుతోంది. శ్రీవారిని తనివితీరా రెండు సెకన్లు చూసేందుకు…. తమ కోరికలు తీర్చారని లేకపోతే తీర్చాలని మొక్కుకునేందుకు అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితుల నుంచి శ్రీవారి భక్తులను తప్పించి… సంతృప్తికరమైన దర్శనాన్ని వేగంగా అందించగలిగే విషయంలో కొత్త టీటీడీ బోర్జు విజయవంతమైతే.. శ్రీవారికి అంత కన్నా గొప్ప సేవ ఉండదు.
ఒక్క సారి శ్రీవారి దర్శనానికి వెళ్లి రావాలంటే సామాన్య కుటుంబానికి వేల రూపాయల ఖర్చు అవుతాయి. అలాంటి పరిస్థితులను కూడా మార్చేందుకు టీటీడీ బోర్డు ప్రయత్నించాలి. శ్రీవారిని దర్శించుకోవడం భక్తులకు.. భారం కాకుండా చేయాల్సి ఉంది.