పవన్ కల్యాణ్ వాలంటీర్ల విషయంలో చేసిన వ్యాఖ్యలపై అప్పటి జగన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నతాధికారుల్ని ఆదేశించి ఉత్తర్వులు జారీ చేయించి మరీ కేసులు పెట్టింది. ఆ కేసులు పెట్టింది వాలంటీర్లు అని మభ్య పెట్టారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో మొత్తం తేలిపోయింది. అసలు తాము ఫిర్యాదు చేయలేదని గతంలో వాలంటీర్లుగా పని చేస్తూ ఫిర్యాదులో పేర్కొన్న వారు గుంటూరు జిల్లా కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు. అసలు లేని ఫిర్యాదుతో కేసేమిటని న్యాయమూర్తి ఆ కేసును కొట్టేశారు.
వాలంటీర్లు నిజంగానే ఫిర్యాదు చేయలేదు. వారి పేరుతో ఫిర్యాదు రాసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. వాలంటీర్లు ఆ ఫిర్యాదులపై ఎలాంటి సంతకాలు చేయలేదు. వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లు కావడంతో ఇష్టం వచ్చినట్లుగా ప్రకటనలు ఇప్పించుకున్నారు. మీడియాతో మాట్లాడించుకున్నారు. మాట్లాడితే మనోభావాల గురించి ప్రకటనలు ఇచ్చేవారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యే సరికి తాము ఎలాంటి ఫిర్యాదులు ఇవ్వలేదంటున్నారు.
గత ప్రభుత్వం కేసుల పేరుతో వేధించని ప్రతిపక్ష రాజకీయ నేత లేడు. పవన్ కల్యాణ్ పైనా ఎక్కడ చాన్స్ దొరికితే అక్కడ కేసులు నమోదు చేశారు. అన్నీ తప్పుడు కేసులే. ఇప్పుడు అన్నీ తెలిపోతున్నాయి. అయితే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ నాటి ప్రభుత్వ పెద్దలకు లొంగి తప్పుడు పనులు చేసిన వారే నేడు కూడా ప్రభుత్వంలో ఉన్నారు. అందరిపై చర్యలు ఎలా తీసుకుంటామని కూటమి ప్రభుత్వం డైలమాలో ఉంది.