భారత రాష్ట్ర సమితి వర్కింగ్ చీఫ్ కేటీఆర్ రాజకీయం భిన్నంగా సాగుతోంది. ఆయన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం లేదు. రేవంత్ ను మాత్రమే చేస్తున్నారు. రేవంత్ ను పక్కకు తప్పిస్తే కాంగ్రెస్ పని అయిపోతుందని అనుకుంటున్నారో లేకపోతే రేవంత్ లేకపోతే చాలు కాంగ్రెస్ తో అయినా దోస్తీకి సిద్దమని అంటున్నారో కానీ.. ఆయన రాజకీయం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. పదే పదే కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ కు ట్యాగ్ చేసి ట్వీట్లు వేయడం దగ్గర నుంచి పూర్తిగా రేవంత్ ఇమేజ్ ను హైకమాండ్ వద్ద తక్కువ చేసేందుకు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు.
కాంగ్రెస్ ఓకే కానీ రేవంత్ కాదన్నట్లుగా బీఆర్ఎస్ ప్రకటనలు
గాంధీభవన్లో గాడ్సే వారసుడు అంటూ కేటీఆర్ తరచూ చెబుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ కేటీఆర్కు పవిత్రంగానే కనిపిస్తోంది. కానీ అందులో రేవంత్ మాత్రమే గాడ్సేలా కనిపిస్తున్నారు. ఆయనను తప్పించాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి రేవంత్ వల్ల కాంగ్రెస్ నష్టపోతుందని రాహుల్ కు ట్యాగ్ చేసి చెబుతున్నారు. రేవంత్ వల్ల కాంగ్రెస్ కు లాభమో.. నష్టమో రాహుల్కు తెలియదా… కేటీఆర్ చెప్పాలా ?
కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ తాజా రాజకీయం
రేవంత్ కు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వకుండా బీఆర్ఎస్ ముఖ్యనేతలు చేసిన ప్రయత్నాల గురించి అందరికీ స్పష్టత ఉంది. అయితే ఏవీ వర్కవుట్లు కాలేదు. అన్నీ రేవంత్ కు ప్లస్ అయ్యాయి. ఇప్పుడు ఆయన కుటుంబాన్నే టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కుటుంబం ఏదో చేస్తుందని సోదరుడు, అల్లుడు అంటూ ప్రకటనలు చేస్తూ పోతున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు అల్లుడు.. లిక్కర్ స్కాంలో కూడా కవితతో పాటుపేరు వినిపించిన సృజన్ రెడ్డి అనే వ్యక్తిని రేవంత్ రెడ్డికి అటాచ్ చేసేశారు. కొడంగల్ లో రేవంత్ తరపున వ్యవహారాలు చూసే తిరుపతిరెడ్డి రాజ్యాంగేతర శక్తి అని విమర్శిస్తున్నారు. ఇప్పుడు మరింత ముందుకు వెళ్లి ఆయన కుటుంబం మొత్తాన్ని విమర్శిస్తున్నారు.
రేవంత్ పై దాడిని కాంగ్రెస్ తిప్పికొట్టగలదా ?
బీఆర్ఎస్ వ్యూహం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తాము ప్రత్యేకంగా కాంగ్రెస్ ను కాదని రేవంత్ ను టార్గెట్ చేస్తే చాలని కాంగ్రెస్ పార్టీ బలహీనం అయిపోతుందని అనుకుంటోంది. మిగతా సీనియర్లతో తాము ఓ ఆట ఆడుకోవచ్చు కానీ.. రేవంత్ మాత్రమే కొరకరాని కొయ్యలా మారారని కేటీఆర్ అనుకుంటున్నారు. అందుకే రేవంత్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. అయన కుటుంబాన్ని బద్నామ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో బీఆర్ఎస్ సక్సెస్ అయితే కాంగ్రెస్ కు గడ్డు కాలమేనని అనుకోవచ్చు.