గన్న వరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పక్కాగా ఫ్రేమ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. గన్నవరంలో నియోజకవర్గంలో ఆయన ముఖ్య అనుచరులందరిపై ఉన్నపాత కేసుల్లో అరెస్టులు చేస్తున్నారు. తాజాగా నలుగుర్ని అరెస్టు చేశారు. ఆయన అరాచకాల్లో కీలకంగా ఉండే కొమ్మాకోట్లు అనే వ్యక్తి దగ్గర నుంచి రౌడీయిజం చేసి..దాడులకు దిగే ప్రతి ఒక్కరిని అరెస్టు చేస్తున్నారు. వారంతా వైసీపీ హయాంలో సంఘ విద్రోహశక్తులుగా పేరు తెచ్చుకున్నారు.
చేయాల్సినదంతా చేసి అనుచరుల్ని గాలికి వదిలేసి వల్లభనేని వంశీ ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోర్టు వాయిదాలకు తప్ప గన్నవరం రావడం లేదు. కోర్టు వాయిదాలకూ మారు వేషాల్లో రావాల్సి వస్తోంది. త్వరలో ఆయన మరో కోర్టు వాయిదాకు రావాల్సి ఉంది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయన డిసెంబర్ లో కోర్టుకు రావాల్సి ఉంది. ఈ లోపు ఆయనపై కొత్త కేసులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మట్టి తవ్వకాల విషయంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే దోచుకున్నారని విచారణ చేయిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటన కూడా చేశారు.
వల్లభనేని వంశీ టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి మారి చేసిన వికృతాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఆయనను రోడ్డుపై రాళ్లతో కొట్టినా తప్పు లేదని.. అలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలని టీడీపీ క్యాడర్ కోరుకుంటోంది . అయితే చట్టపరంగానే చూస్తామని.. ఎవర్నీ వదిలేదని లేదని అంటున్నారు. ఆలస్యం అవుతున్న కొద్దీ వారు సామాజికవర్గాన్ని చూపించి మమ్మల్ని ఏమీచేయరని ప్రచారం చేసుకుంటున్నారు. అందుకే.. మరో నెలలోనే చేయాల్సిన పనిని పూర్తి చేసేందుకు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. దానికి తగ్గట్లుగా వ్యవహారాలు నడుస్తున్నాయంటున్నారు.