శాసనమండలిలో పూర్తి మెజార్టీ పెట్టుకుని టీడీపీతో చెడుగుడు ఆడుకోవాలని అనుకున్న జగన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదాలో వెళ్తున్న బొత్స సత్యనారాయణ షాక్ ఇస్తున్నారు. ఆయన టీడీపీని సవాల్ చేయడం లేదు సరి కదా.. బతిమాలుకుంటున్నట్లుగా రాజకీయం చేసి అవసరం అయితే వాకౌంట్లు చేసి.. లేకపోతే టీడీపీ సభ్యులకు సవాళ్లు చేసే అవకాశం కల్పించి వైసీపీని మరింత చులకన చేస్తున్నారు. స్వయంగా చైర్మన్ వైసీపీ నేత అయినా ఆయనను ఉపయోగించుకుని టీడీపీని ఇరుకున పెట్టడంలో విఫలం కావడమే కాదు.. మొత్తం వైసీపీ తప్పుల్ని బయట పెట్టేలా చేస్తున్నారు. దీంతో బొత్స వ్యవహారం ఏదో తేడాగా ఉందే అని తాడేపల్లిలో మథనం ప్రారంభమయింది.
సోషల్ మీడియా అరెస్టుల దగ్గర నుంచి లా అండ్ ఆర్డర్ వరకూ మండలిలో చర్చ జరిగింది. టీడీపీ సభ్యులు పది మంది ఉన్నారు. వైసీపీ సభ్యులు ముఫ్పై మందికిపైగా ఉన్నారు. కానీ గట్టిగా తమ వాదన వినిపించడంలో బొత్స టీమ్ విఫలమయింది. దీంతో వైసీపీ హయాంలో జరిగిన నిర్వాకాలే మండలిలో హైలెట్ అయ్యాయి. బొత్స సత్యనారాయణ ఇదంతా కావాలని చేస్తున్నారా అని.. వైసీపీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. తమ పార్టీ నేతలు లోకేష్ తల్లిని కించ పరచింది నిజమేనని మండలిలో ఆయన స్టాంప్ వేసేశారు. అలాంటి వారిని తాము ప్రోత్సహించబోమని చెప్పడం అంబటి రాంబాబు లాంటి వాళ్లకు వాత పెట్టినట్లయింది. దాంతో ఆయన తాను లోకేష్ తల్లిని కించ పరిచినట్లు నిరూపించాలని సవాల్ చేసుకోవాల్సిన వచ్చింది.
బొత్స సత్యనారాయణ వైసీపీ కోసం కాకుండా వైసీపీని బద్నాం చేసేందుకు మండలిలో రాజకీయం చేస్తున్నారనన్న అనుమానాలు వైసీపీలో వినిపిస్తున్నాయి. ఇటీవల విజయనగరంలో ఐఏఎస్ అధికారి కిషోర్ కుమార్ ను అడ్డం పెట్టుకుని బొత్స ఫ్యామిలీ చేసిన భూదందాలన్నీ వెలుగులోకి వచ్చాయి. మండలిలో దూకుడు చూపిస్తే మొదటికే మోసం వస్తుందన్న ఉద్దేశంతో ఆయన సైలెంట్ గా.. టీడీపీకి నొప్పి తెలియకుండా.. వైసీపీనే బద్నాం చేసేలా మండలిలో వ్యవహరిస్తున్నారని వైసీపీ పెద్దలు అనుమానిస్తున్నారు. అయితే ఇప్పుడు బొత్సను ఏమీ అనలేని పరిస్థితిలో వైసీపీ ఉంది.