ఇరవై ఏళ్ల క్రితం సామాన్య మధ్యతరగతి జీవి ఇల్లు కొనాలంటే జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్ముతో రిటైర్మెంట్ దగ్గర పడే సరికి ఓ ఇల్లు కొనగలుగుతాడేమో. ఎందుకంటే అప్పట్లో హోమ్ లోన్స్ అంత విస్తృతంగా అందుబాటులో ఉండేవి కావు. సాఫ్ట్ వేర్ బూమ్ రాక ముందు పెద్ద మొత్తంలో లోన్లు తీసుకుని ఈఎంఐలు కట్టే సామర్థ్యం ఉన్న వారు కూడా తక్కువగానే ఉండేవారు ఉన్న వారు కూడా ఇంటి కోసం ఊహించనంత మొత్తం లోన్ తీసుకోవడానికి జంకేవారు. ఇరవై ఏళ్ల పాటు నెలా నెలా జీతంలో సగం కట్టాలా అని ఆలోచించేవారు. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి.
ఇప్పుడు అమ్ముడుపోతున్న ప్రతి వంద ఇళ్లలో ఎనభై అప్పుల మీదనే తీసుకుంటున్నారు. ఎనభై శాతం ప్రాపర్టీలు బ్యాంకులు, హోమ్ లోన్ సంస్థల వద్ద తనఖాకు వెళ్తున్నాయి. ఆస్తిపత్రాలు రిజిస్ట్రేషన్ అవగానే.. ఓనర్ చేతికి రాకుండానే వారి చేతికి వెళ్లిపోతున్నాయి. ఓ పది ఇరవై ఏళ్ల పాటు వారి దగ్గరే ఉంటాయి. మొత్తం తీర్చేసిన తర్వాతే చేతికి వస్తాయి. ఇరవై శాతం మంది మాత్రమే మొత్తం డబ్బులు వెచ్చించి ఇల్లు కొంటున్నారు. వీరు ఆర్థికంగా స్థితిమంతులు. మధ్యతరగతి ప్రజలు మాత్రం అత్యధికం హోమ్ లోన్స్ మీద ఆధారపడి ఇళ్లను కనుగోలు చేస్తున్నారు.
ఫలితంగా హోమ్ లోన్స్ ఇచ్చే కంపెనీల టర్నోవర్ వేల కోట్లలో ఉంటోంది. ఎల్ఐసీ హోమ్ ఫైనాన్సింగ్ సంస్థ హైదరాబాద్ శివారులోని నిర్మితమవుతున్న కొన్ని కాలనీలకు కాలనీల్లో అత్యధిక ఇళ్లకు లోన్లు ఇచ్చింది. ఆ ప్రాపర్టీలు మొత్తం ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ దగ్గరే ఉంటాయి. ఇలా ఆ సంస్థ టర్నోవర్ వేల కోట్లకు చేరుకుంది. లాభాలు కూడా ఆ స్థాయిలోనే వస్తున్నాయి. ఇక ఇతర బ్యాంకులు,ఆర్థిక సంస్థలు హోమ్ లోన్స్ కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలను విస్తరించాయి.
మధ్యతరగతి ప్రజల స్వప్నం సొంత ఇల్లు. ముందే సొంత ఇల్లు సమకూర్చుకుని అద్దె భారం తగ్గించుకుని ఆ మొత్తం సొంత ఇంటికి ఈఎంఐకి వెచ్చిస్తే సరిపోతుందని అనుకుంటారు. ఇలా రకరకాలతో హోమ్ లోన్స్ పెరిగిపోతున్నాయి. దీని వల్ల లాభాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే.. అద్దె భారం తగ్గుతుంది.. ఆస్తి విలువ పెరుగుతుంది.. ఇరవై ఏళ్ల పాటు ఈఎంఐ కూడా మారదు.