హైదరాబాద్ నుండి ప్రభుత్వ శాఖలను విజయవాడకు తరలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదివరకు ఎంత ప్రయత్నించినా ఉద్యోగ సంఘాలు ససేమిరా అనడంతో హైదరాబాద్ నుండే పరిపాలన కొనసాగించవలసి వస్తోంది. కానీ ఫోన్ ట్యాపింగ్ దెబ్బతో ఇక హైదరాబాద్ నుండి పరిపాలన కొనసాగించేందుకు ఎంత మాత్రం ఇష్టపడటం లేదు. ఇష్టమున్న కష్టమయినా హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ఉద్యోగులు తక్షణమే విజయవాడకు తరలి రావలసిందేనని చంద్రబాబు నాయుడు చెపుతున్నారు. చెప్పడమే కాదు ఈరోజు నుండి వారానికి ఐదు రోజులు విజయవాడలోనే ఉంటూ అక్కడి నుండే పరిపాలన సాగించడం మొదలుపెట్టేసారు కూడా. విజయవాడలో ఉన్న కలెక్టర్ కార్యాలయాన్ని రాష్ట్ర విభజన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంగా మార్చుతూ ఒక జి.ఓ.జారీ చేసారు. కనుక ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు నేటి నుండి వారానికి నాలుగు రోజులు విజయవాడలోనే ఉండబోతున్నారు.
ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామీణ, ఆర్ధిక శాఖలపై విజయవాడలో సమీక్షించబోతున్నారు. అంటే ఆ రెండు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హైదరాబాద్ నుండి తరలిరాక తప్పలేదని స్పష్టం అవుతోంది. రేపు వేరే శాఖలకు సంబంధించి వ్యవహారాలను సమీక్షిస్తే వారు విజయవాడకు తరలిరాక తప్పదు. ఈనెల 17న జరుగబోయే మంత్రివర్గ సమావేశంతో సహా ఇకపై అన్ని సమావేశాలు విజయవాడలోనే నిర్వహించబోతున్నట్లు ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు.
కానీ ఒకేసారి సుమారు 25-35,000 మంది ఉద్యోగులు విజయవాడకు తరలిరావాలంటే వారందరికీ వసతి, కార్యాలయాల ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. హైదరాబాద్ లో ఉన్న ఫైళ్ళనన్నిటినీ విజయవాడ కార్యాలయాలకు తరలించవలసి ఉంటుంది. ఈ పనులన్నీ దశలవారిగా చేసుకొంటూ వెళితే అంతా సజావుగా పూరతవుతుందేమో కానీ రాత్రికి రాత్రి మూట ముల్లె సర్దుకొని ఉద్యోగులను, కార్యాలయాలను తరలించేయాలంటే చాలా కష్టమే కాదు ఊహించని ఆనేక సమస్యలు కూడా ఎదుర్కోవలసి రావచ్చును. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే ఇంత తొందరపడుతున్నట్లయితే, దానికి విరుగుడు కనుగొనాలి కానీ ఒక సమస్యని వదిలించుకోబోయి మరిన్ని కొత్త సమస్యలు సృష్టించుకోవడం మంచిది కాదేమో? ఆలోచించాలి.