వివేకా హత్య కేసులో అడ్డంగా దొరికిపోయినా అవినాష్ రెడ్డి లాంటి వాళ్లను పట్టుకోవడానికి చట్టం చేతులు సరిపోతున్నట్లుగా లేదు. తన తండ్రిని హత్య చేసిన వారిని శిక్షించాలంటూ ఆయన కుమార్తె సునీత చేస్తున్న న్యాయపోరాటం ఎంత అనుకుంటే అంత కంటే రెట్టింపు ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం వివేకా హత్య కేసు పిటిషన్లన్నీ సుప్రీంకోర్టులోనే ఉన్నాయి. ఒక్క విచారణకు వస్తే తదుపరి విచారణ ఏకంగా నాలుగైదు నెలలకు వాయిదా పడుతోంది. తాజాగా అదే జరిగింది.
అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సునీత వేసిన పిటిషన్ పై విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. వాదనల తర్వాత అవినాష్ రెడ్డితో పాటు జైలుకు వెళ్లి మరీ దస్తగిరిని బెదిరించిన శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి నోటీసులు జారీ చేసింది.తుదపరి విచారణ మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది. అదే సమయంలో తమపై తప్పుడు కేసులు పెట్టారని అప్పట్లో వివేకా కేసు దర్యాప్తు చేసిన సీబీఐ అధికారి రాంసింగ్ తో పాటు సునీత, రాజశేఖర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కూడా ఫిబ్రవరి ఆఖరుకు వాయిదా పడింది.
తదుపరి విచారణ కొనసాగించాడనికి కూడా సీబీఐకి ప్రస్తుతం అనుమతి లేదు.ఈ కారణంగా దర్యాప్తు ఎక్కడిదక్కడ ఆగిపోయింది. మరో వైపు సునీత పట్టుదలని విక్రమార్కురాలిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. మంగళవారం ఉదయం అసెంబ్లీకి వచ్చి సీఎంవో అదికారుల్ని కలిశారు. వివేకా హత్య కేసులో ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో త్వరలో విచారణకు వచ్చేలా చూడాలని కోరారు.