కేసీఆర్ చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. నియామక పరీక్షలు నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాలి కానీ, నేరుగా వారిని రెగ్యూలరైజ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. సెక్షన్ 10ఏ ప్రకారం జీవో 16 ద్వారా గత BRS ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేసింది. ముఖ్యంగా విద్య, వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించింది.
ఇప్పుడు క్రమబ్దదీకరించిన ఉద్యోగులకు కనీసం కాంట్రాక్టు ఉద్యోగాలు ఉంటాయా అనేది సస్పెన్స్ గా మారింది. దీనిపై హైకోర్టు నుంచి తమకు ఆర్డర్ కాపీ వస్తే స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల క్రబద్దీకరణ అన్నది ఎన్నికల హామీ. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా ఉండరు అని ప్రకటన చేశారు.పదేళ్లకు చివరికి ఎన్నికలకు ముందు క్రమబద్దీకరణ చేశారు. అదీ అందరికీ కాదు. అప్పటికీ కొన్ని షరతులు పెట్టారు.
అయితే చేయాల్సిన పద్దతిలో చేసి ఉంటే కోర్టులో ఎదురుదెబ్బ తగిలేది కాదన్న వాదన వినిపిస్తోంది. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఏదో ఓ పరిష్కారం చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కేసీఆర్ చేపట్టిన ఉద్యోగ నియామకమూ సరిగ్గా జరగలేదని..ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ కూడా అలాగే తయారయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.