సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ షాక్ ఇచ్చారు. తన భార్య సైరా భానుతో విడిపోతున్నట్టు ప్రకటించారు. 1995లో సైరాని పెళ్లి చేసుకొన్నారు రెహమాన్. వీరికి ఇద్దరు పిల్లలు. ఒకరు ఖతీజా, ఇంకొకరు ఆమీన్. త్వరలోనే వీరి వైవాహిక జీవితం 30వ ఏట అడుగుపెట్టబోతోంది. ఈలోగానే కఠినమైన నిర్ణయం తీసుకొన్నారు.
”విరిగిన మనసులు దేవుడ్ని సైతం ప్రభావితం చేస్తాయి. ఇవి మళ్లీ అతుక్కోవు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది. త్వరలోనే మా బంధం 30 ఏళ్లకు చేరుతుందని సంతోషించాం. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సివస్తుందని అనుకోలేదు. ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో స్నేహితులు, సన్నిహితులు, మీడియా మా ప్రైవసీని కాపాడతారని భావిస్తున్నాం” అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు రెహమాన్. ”వీరిద్దరిమధ్య ప్రేమ ఉన్నప్పటికీ కఠినమైన పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది” అంటూ రెహమాన్ తరపున న్యాయవాది వందనా షా పేర్కొన్నారు. ముస్లిం లా ప్రకారం విడాకులు తీసుకొనే వీలున్నా, మున్ముందు ఎలాంటి సమస్యలూ రాకూడదని లీగల్గా ప్రొసీడ్ అయినట్టు తెలుస్తోంది.
సాధారణంగా సెలబ్రెటీల జీవితాలు తెరచిన పుస్తకాలు. వాళ్లేం మాట్లాడకుండానే, వాళ్ల జీవితాల్లో ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతుంటుంది. అయితే రెహమాన్ వైవాహిక జీవితంలో రాబోతున్న ఈ సునామీ గురించి ఎవరికీ ఎలాంటి క్లూ లేదు. సడన్ గా రెహమాన్ ప్రకటన చేసే సరికి అంతా ఆశ్చర్యపోయారు. రెండేళ్ల నుంచి.. ఈ జంట మధ్య విబేధాలు తలెత్తాయని, పరిష్కార మార్గాల గురించి ఇద్దరూ అన్వేషించారని, అయితే విడాకులు మినహా మరో మార్గం లేకుండా పోయిందని సన్నిహితులు చెబుతున్నారు. ఈ విషయం మీడియాకు పొక్కి, లేనిపోని గందరగోళం సృష్టించకముందే తమ జీవితంలో ఏం జరిగిందో స్వయంగా చెప్పేయాలని రెహమాన్ నిర్ణయించుకొన్నారని, అందుకే ఈ ట్వీట్ చేశారని తెలుస్తోంది.