పోలవరం ప్రాజెక్టుకు రూ. యాభై వేల కోట్లకుపైగా ఖర్చు అవుతోంది. జగన్ రెడ్డి తన హయాంలో బటన్లు నొక్కి రెండు లక్షల కోట్లు జనం జేబుల్లో వేశానని చెబుతూంటారు. దాని వల్ల ఒక్క కుటుంబం ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదు కానీ మద్యంరేట్లను పెంచి అంతకు మించి వసూలు చేశారు. అలా ప్రభుత్వానికే డబ్బు తిరిగి వచ్చింది. కానీ పోలవరం లాంటిప్రాజెక్టులు మాత్రం ఎక్కడివక్కడ ఉండిపోయాయి. ఏ అభివృద్ధి పని చేయాలన్నా మా దగ్గర డబ్బులు లేవు అనేవారు. కానీ అప్పులు మాత్రం పది లక్షల కోట్లను దాటించేశారు. ఇప్పుడు ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టాలన్నా అప్పులు కూడా కష్టమే.
ప్రస్తుతం చంద్రబాబు ఏపీని కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలవరం పూర్తి అయిన తర్వాత ఆ నీటిని రాయలసీమ తరలించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నదుల అనుసంధానం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. గోదావరి నీటిని కృష్ణాకు తరలించి అక్కడ్నుంచి బనకచర్లకు తరలించేందుకు ప్రాజెక్టుకు చంద్రబాబు రూపకల్పన చేస్తున్నారు. దీనికి కనీసం రూ. 70 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఇంత డబ్బు ప్రభుత్వం సమకూర్చుకోవడం అసాధ్యం. అందుకే చంద్రబాబు కొత్త ఆలోచన చేశారు. దాని ప్రకారం ప్రైవేటు, ప్రభుత్వ పార్టనర్ షిప్లో ప్రాజెక్టుల్ని నిర్మిస్తారు. ఆ ప్రాజెక్టు ద్వారా ఆయా కంపెనీలు ఆదాయం సంపాదించుకునే మార్గాలు చూపిస్తారు. నీటి తీరువా వసూలు చేస్తారా మరొకటా అన్నది తర్వాత. రైతుల పంటలకు కావాల్సినంత నీరు సదుపాయం వస్తే.. అంత కంటే కావాల్సిందేమీ ఉండదు.
ఇదే ప్లాన్‌ను చంద్రబాబు రోడ్ల విషయంలోనూ అమలు చేయాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే ఆయన అసెంబ్లీలో ప్రకటన చేశారు. పబ్లిక్, ప్రైవేటు పార్టనర్ షిప్‌తో జిల్లా స్థాయిలోనూ రోడ్లు వేయించాలని అనుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇలా నిర్మిస్తే వాటికి టోల్ కట్టాల్సి ఉంటుంది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. అందుకే ఈ అంశంపై విస్తృతంగా ప్రజల్లో చర్చ పెట్టాలని అనుకుంటున్నారు.
PPP విధానంతో ఏపీని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ఎన్నికలకు ముందు నుంచీ చెబుతున్నారు . ప్రజల ఆదాయాలను పెంచితే వారు ఈ విధానం ద్వారా మేలు జరిగితే ఎంతో కొంత పన్నులు కట్టేందుకు సిద్ధంగా ఉంటారు. మేలు జరగకపోతే మాత్రం ప్రజా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది.