హైదరాబాద్లో సొంత ఇల్లు ఉండాలని అనుకునేవారు ఎక్కువగా ఏ ప్రాంతం వైపు చూస్తున్నారు అని పరిశీలిస్తే ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్లో ఎక్కడో ఓ చోట అని ఇళ్ల కొనుగోలుదారులు అనుకోవడం లేదు. వెస్ట్ జోన్లోనే కావాలని మెజార్టీ కోరుకుంటున్నారు. హైదరాబాద్లోని అమ్ముడవుతున్న ఇళ్లల్లో 53 శాతం వెస్ట్ జోన్లోనే ఉంటున్నాయని రికార్డులు చెబుతున్నాయి.
మొత్తం గ్రేటర్ ను ఐదు జోన్లుగా విభజించారు. గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, రామచంద్రాపురం, పటాన్ చెరు, మూసాపేట, కూకట్ పల్లి ప్రాంతాలను కలిపి వెస్ట్ జోన్ అంటారు. ఈ ప్రాంతాల్లోనే 53 శాతం మంది ఇళ్లు కొంటున్నారు. మిగతా నాలుగు జోన్స్ కలిపి 47 శాత మంది కొంటున్నారు. అంటే ఒక్క జోన్లో సగం డిమాండ్ ఉంటే.. మిగతా నాలుగు జోన్లకు కలిపి అంత కంటే తక్కువ డిమాండ్ ఉంటోందన్నమాట. వెస్ట్ జోన్కు ఈ డిమాండ్ రావడానికి ప్రధాన కారణం ఐటీ ఉద్యోగులని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
వెస్ట్ జోన్ తర్వాత ఎక్కువ డిమాండ్ ఈస్జ్ జోన్లో ఉంది. ఉప్పల్ నుంచి హయత్ నగర్ వరకూ ఈ జోన్ పరిధి ఉంది. ఖుత్బుల్లాపూర్ పరిధిలోకి వచ్చే నార్త్ జోన్లో కూడా కాస్త డిమాండ్ ఎక్కువగానే ఉంది. అయితే హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా నివాస యోగ్యమేనని అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయని ప్రజలు చెబుతున్నారు. ఉపాధి అవకాశాలు ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ ఇళ్లకు డిమాండ్ ఉంటుంది. ఈ ప్రకారం చూస్తే.. వెస్ట్ జోన్లో ఐటీ రంగం డిమాండ్ కు ప్రధాన కారణంగా నిలుస్తోందని అనుకోవచ్చు.