మీడియాతో సినిమా వాళ్ల ఇంట్రాక్షన్ల పద్ధతి మారుతోంది. రెగ్యులర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం బోర్ కొట్టడంతో.. వాళ్లూ కొత్తదనం కోరుకొంటున్నారు. అందులో భాగంగా `మెకానిక్ రాఖీ` టీమ్.. ‘మంచి క్వశ్చన్ కొట్టు.. గోల్డ్ క్వాయిన్ పట్టు’ అనే కార్యక్రమం నిర్వహించారు. మంచి ప్రశ్న అడిగిన జర్నలిస్టులకు బంగారు నాణెం ఇచ్చి సత్కరించారు. ఇప్పుడు దిల్ రాజు టీమ్ కూడా ఇదే పంథాలో ఆలోచించింది. ప్రశ్నలు తరవాత.. ముందు ఈ సినిమా కథేంటో గెస్ చేయమంటూ ఓ ఫజిల్ విసిరింది.
దిల్ రాజు బ్యానర్లో రూపుదిద్దుకొన్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. వెంకటేష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో Q and A సెషన్ కు బదులుగా సినిమా కథేమిటో గెస్ చేయమని మీడియా వాళ్ల ముందుకు ఓ ఫజిల్ తీసుకొచ్చింది చిత్రబృందం. కథ కు దగ్గరగా గెస్ చేసిన వాళ్లకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గిఫ్ట్ హ్యాంపర్లు కూడా ఇస్తామని చెప్పారు. దాంతో జర్నలిస్టులంతా తమ తెలివితేటలకు పదును పెట్టి, ఈ సినిమా కథని గెస్ చేయడం మొదలెట్టారు. అసలు కథ బయటకు వచ్చిందా, లేదా? అనేది పక్కన పెడితే – ఈ ఈవెంట్ కాస్త ఫన్ తీసుకొచ్చింది. ఎవరికి తోచిన కథలు వాళ్లు చెప్పడం, మధ్యలో వెంకీ మోనో యాక్షన్ చేయడం, అనిల్ రావిపూడి కౌంటర్లు వేయడం, దిల్ రాజు సరదాగా నవ్వులు చిందించడం.. ఇలా ఈవెంట్ సరదాగా సాగిపోయింది. మొత్తానికి రెగ్యులర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి చెక్ పెట్టడానికి చిత్రబృందాలు ప్రయత్నిస్తున్నాయన్న విషయం మాత్రం అర్థమైంది. రాబోయే రోజుల్లో సినిమా వేడుకలు ఇంకెన్ని కొత్త హంగులతో సాగుతాయో చూడాలి.