ప్రజలతో మమేకం అయ్యే విషయంలో చంద్రబాబు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. మొదటి సారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన దూరదర్శన్లో ప్రజలతో ముఖ్యమంత్రి కార్యక్రమం నిర్వహించేవారు. అప్పట్లో ఇంటర్నెట్ లేదు.. స్మార్ట్ ఫోన్లు లేవు. శాటిలైట్ చానల్స్ లేవు. దూరదర్శన్ ఎక్కువ మందికి అందుబాటులో సమాచార సాధనం. అది బాగా వర్కవుట్ అయింది. తర్వాత వైఎస్ సీఎం అయ్యే నాటికి శాటిలైట్ చానల్స్ వచ్చాయి. వాటిలో ఆయన అలాంటి ప్రోగ్రాంలు చేశాం.
ఆ తర్వాత సమాచార విప్లవం వచ్చేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రజలతో మేమేకం కావడానికి ఎన్నో సాంకేతిక అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లేలా చెప్పడానికి వినూత్న మార్గాలను అన్వేషించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధాని మోదీ .. పదవి చేపట్టినప్పటి నుండి మన్ కీ బాత్ అనే ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఇందులో రాజకీయాలకు అతీతంగా ఆయన చేసే ప్రసంగాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. మరుమూల గ్రామాల్లో సమాజం మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారినీ గుర్తించి ప్రోత్సహిస్తున్నారు.
ఇప్పుడు చంద్రబాబు కూడా నాడు ప్రజలతో ముఖ్యమంత్రి, నేడు మన్ కీ బాత్ల తరహాలో రెండు ప్రోగ్రాంలను కలిసి ఉండేలా ఓ ప్రోగ్రాంను ప్లాన్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. జనవరి నుంచి ఈ ప్రోగ్రాం ద్వారా ఆయన ప్రజలతో నిత్యం టచ్ లో ఉండేందుకు ప్రయత్నం చేయనున్నారు. ఈ కార్యక్రమం ఆయనను ప్రజలకు మరింత దగ్గర చేసేలా ఉంటుందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.