సోషల్ సైకోల వెనుక నిందితుడు ఏ ప్యాలెస్లో ఉన్నా సరే అరెస్టు చేయాలని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. ఆమె బాధితురాలు. ఇంకాచెప్పాలంటే అలాంటి బాధితులందరిదీ అదే మాట. ఆ బాధితుల్లో చంద్రబాబు ఉన్నారు..లోకేష్ ఉన్నారు..పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. పవన్ ఆగ్రహంతోనే చర్యలు ప్రారంభించారు. ఇప్పటి వరకూ సైకో మూక సంగతి చూశారు. ఇప్పుడు అసలు సూత్రధారుల సంగతి తేల్చాల్సి ఉంది.
విజయమ్మతో పాటు షర్మిలపై పోస్టులు పెట్టడం వెనుక అవినాష్ రెడ్డి ఉన్నాడన్నది బహిరంగ రహస్యం. ఆయన పీఏ రాఘవరెడ్డిని దాచిపెట్టడం కూడా తాను దొరికిపోతాననే. అయితే పోలీసులు ఆయన పీఏను కూడా పట్టుకునేంత సామర్థ్యం లేదా అన్న డౌట్ వస్తుంది. సజ్జల భార్గవరెడ్డి గురించి డీఐజీ కోయ ప్రవీణ్ స్పష్టమైన ప్రకటన చేశారు. ఆ తర్వాత ఆయనను అరెస్టు చేయలేకపోయారు. నిజానికి ఈ సజ్జల భార్గవరెడ్డిని ఆయన తండ్రి రామకృష్ణారెడ్డి వైసీపీ ఓడిపోగానే సేఫ్ ప్లేస్కు పంపేశారని చెబుతున్నారు. కానీ ఎక్కడున్నాడో తెలుసుకుని పట్టుకోవడం పెద్ద విషయం కాదు.
ఓ పద్దతిగా ఆర్గనైజింగ్ క్రైమ్ జరిగిందనేది అందరికీ తెలుసు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి ఇష్టారీతిన మనుషులపై తప్పుడు ప్రచారం చేశారు. తమను వ్యతిరేకించిన ప్రతి ఒక్కరికి రంకులు అంటగట్టారు. పుట్టుకల్ని ప్రశ్నించారు. ఇంటూరి రవికిరణ్ , వర్రా రవీంద్రారెడ్డి లాంటి వాళ్లను ఏం చేసినా తప్పు ఉండదన్న స్థాయిలో పావులుగా వాడుకున్నారు. శిక్ష వారితో పాటు వారిని ప్రోత్సహించిన వారికీ పడాల్సిందే.
ఇలాంటి సైకోలపై హైకోర్టు కూడా దయాదాక్షిణ్యాలు చూపడం లేదు. రాజకీయంగా విమర్శలు అంటే.. అసభ్యకరమైన వ్యాఖ్యలతో తల్లులపై దాడులు చేయడమా అని ఆశ్చర్యపోయింది. అందుకే వారందరి వెనుక ఉన్న అసలు సైకోను అరెస్టు చేయాలన్న డిమాండ్ ప్రజల్లోనూ పెరుగుతోంది.